Prahlada Ramarao | హైదరాబాద్, మే 10(నమస్తే తెలంగాణ): తాజా ఉద్రిక్తతల వేళ భారత్‌పై పాకిస్థాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లు, ఆకాశ బాంబులన్నీ గాలిలోనే పేలిపోతున్నాయి.. పాక్ ప్రయత్నాలన్నింటికీ భారత్ తన రక్షణ వ్యవస్థతో చెక్ పెడుతున్నది. ఇదంతా రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్-400తోపాటు భారత్ తన సొంత నైపుణ్యంతో అభివృద్ది చేసిన ‘ఆకాశ్’ మిసైల్ కూడా రక్షణ కవచంగా నిలుస్తున్నది. పాక్ బాంబులను తుత్తునీయలు చేస్తున్నది. ఇలాంటి అత్యున్నత రక్షణ వ్యవస్థను భారత ఆర్మీకి అందించిన కీలక వ్యక్తి ప్రహ్లాద్ రామారావు.
15 ఏండ్ల క్రితం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో)లో రామారావు నేతృత్వంలో ఆకాశ్ మిస్సైల్ పురుడు పోసుకున్నది. దీన్ని పూర్తి స్వదేజీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. అయితే దీన్ని హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) తయారు చేయడం గమనార్హం. భూమిపై నుంచి అకాశంలో దాడిచేసే విధంగా దీన్ని రూపొందించారు. 25-30 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని కూడా ఇది ఛేదిస్తుంది. ఇందులో భాగంగానే పాక్ ప్రయోగించిన డ్రోన్ బాంబులన్నింటినీ భారత ఆర్మీ ఆకాశ్ మిసైల్ ద్వారానే గాలిలోనే నిలువరించి పేల్చేసింది. వాస్తవానికి ఎస్-400తోపాటు ఆకాశ్ మిసైల్ ఇంతటి సమర్థవంతంగా పని చేయకపోయింటే తాజా పరిస్థితుల్లో భారత్‌కు గడ్డు పరిస్థితులు ఉండేవని రక్షణరంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. పాక్ సైన్యం డ్రోన్లు, హెలికాఫ్టర్లు, ఫైటర్ జెట్లతో పశ్చిమ భారత్ రాష్ర్టాలపై విరుచుకుపడింది. కానీ ఎస్-400, ఆకాశ్ మిస్సైల్‌ను వినియోగించి ఈ రాష్ర్టాలను పాక్ దాడుల నుంచి సైన్యం కాపాడింది.
అబ్దుల్ కలాం మెచ్చిన శాస్త్రవేత్త
ప్రహ్లాద్ రామారావు 1947 ఫిబ్రవరి 5న బెంగళూరులో జన్మించారు. మద్రాస్‌లో పాఠశాల విద్యను అభ్యసించిన ప్రహ్లాద్.. విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. ఆ తర్వాత బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి పీజీ పూర్తిచేశారు. హైదరాబాద్‌లోని జేఎన్టీయూ నుంచి రాకెట్స్, మిస్సైల్ సిస్టమ్‌లో పీహెచ్డీ పూర్తిచేశారు. ఆ తర్వాత 1971లో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగంలో చేరారు. హైదరాబాద్‌లోని డీఆర్డీఎల్లోనూ పని చేశారు. పలు పరిశోధనల్లో కీలకంగా వ్యవహరించిన ప్రహ్లాద్ రామారావు అంచలంచెలుగా ఎదిగి 2005లో డీఆర్డీవోలో చీఫ్ కంట్రోలర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా ఎదిగారు. అప్పుడే ఆకాశ్ మిస్సైల్ తయారీకి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఆకాశ్ ప్రాజెక్టుకు ప్రహ్లాద్ రామారావు ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అయితే ప్రహ్లాద్ పనితీరును గమనించిన మిస్సైల్ మ్యాన్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కాలం ఆయన్ను ప్రోత్సహించారు. ఆ ప్రోత్సహంతో ప్రహ్లాద్ రామారావు విజయవంతంగా ఆకాశ్‌ను అభివృద్ధి చేశారు. ఇదొక్కటే కాదు పృథ్వీ, అగ్ని, నాగ్ మిస్సైళ్ల తయారీలోనే ప్రహ్లాద్ రామారావు కీలకంగా వ్యవహరించడం విశేషం.
నా బేబీ పనితీరుపై గర్వంగా ఉన్నది
తన నేతృత్వంలో రూపొందించిన ఆకాశ్ మిస్సైల్ పాక్‌తో యుద్ధంలో అద్భుత పనితీరు కనబర్చుతుండటంపై ప్రహ్లాద్ రామారావు హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియాతో తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘నా బేబీ అంచనాలకు మించి పనిచేస్తూ శత్రుదేశాన్ని నిలువరించడం గర్వంగా ఉన్నది’ అని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి ఆకాశ్ టెక్నాలజీని తీసుకునేందుకు తొలుత భారత సైన్యం నిరాకరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఎట్టకేలకు భారత సైన్యం అమ్ముల పొదిలో చేరి శత్రు దేశానికి చుక్కలు చూపిస్తుండటంపై ఆనందం వ్యక్తం చేశారు.