న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: దేశంలోని మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ) తాజాగా కొత్త నిబంధనలను నోటిఫై చేసింది. కొత్త రూల్స్ ప్రకారం అన్ని మెడికల్ కాలేజీలు తప్పనిసరిగా వార్షిక ప్రకటన నివేదికను కమిషన్‌కు సమర్పించాల్సి ఉంటుంది. కళాశాలలో మౌలిక సదుపాయా లు, అవసరమైన అర్హత కలిగిన అధ్యాపకులు, రోగుల సంఖ్యకు అనుగుణంగా సరిపడా క్లినికల్ మెటీరియల్, విద్యార్థులకు గ్రేడింగ్, విద్యార్థుల ఫీడ్‌బ్యాక్, మెడికల్ విద్య ప్రమాణాలకు సంబంధించిన ఇతర సమాచారం వార్షిక నివేదికలో ఇవ్వాలి. ఉల్లంఘస్తే సదరు మెడికల్ కాలేజీపై రూ.కోటి జరిమానా విధించొచ్చు. అదేవిధంగా తప్పుడు వివరాలతో సమాచారం సమర్పిస్తే అధ్యాపులు, డీన్ లేదా డైరెక్టర్‌పై రూ.5 లక్షల జరిమానా వేసేందుకు అవకాశం ఉన్నది.
అక్రిడిటేషన్ నిలుపుదల లేదా వెనక్కు!
దేశంలో అత్యున్నత వైద్య విద్య నాణ్యతా ప్రమాణాలు కల్పించేందుకు కొత్త నిబంధనలను తీసుకొచ్చినట్టు ఎన్ఎంసీ తెలిపింది. పీజీఎంఈబీ లేదా యూజీఎంఈబీ వార్షిక ప్రకటన నివేదికను మూల్యాంకనం చేస్తాయని వెల్లడించింది. నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఎన్ఎంసీ మెడికల్ కాలేజీలకు హెచ్చరికలు జారీచేసింది. జరిమానాలతో పాటు అదనంగా ఐదు అకడమిక్ సంవత్సరాలపాటు కాలేజీల అక్రిడిటేషన్‌ను నిలుపుదల లేదా వెనక్కు తీసుకొనే చాన్స్ కూడా ఉన్నదని ఎన్ఎంసీ నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. ఎవరితోనైనా లేదా ఏ సంస్థతోనైనా ఎన్ఎంసీ, యూజీఎంఈబీ, పీజీఎంఈబీలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తే.. ఆయా మెడికల్ కాలేజీకి సంబంధించిన అన్ని దరఖాస్తులు, అభ్యర్థనల ప్రక్రియలను నిలిపివేస్తామని హెచ్చరించింది.