Mumbai : మహారాష్ట్ర, ముంబైలోని ఒక లేబర్ క్యాంపులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ముంబై, ములంద్ ఈస్ట్, టాటా కాలనీలోని పీఏపీ ప్రాజెక్టు వద్ద గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. సిలిండర్లు పేలడంతో అగ్నిప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ప్రదేశంలోని ఒక జీ+1 బిల్డింగులో కొంతమంది లేబర్లు ఉంటున్నారు. వీరంతా ముంబై మురికివాడ అయిన ధారావి నుంచి వచ్చిన వారు.
ధారావిలో ఆశ్రయం కోల్పోయిన వారికి ఈ బిల్డింగులో పునరావాసం కల్పిస్తున్నారు. దీంతో ఇక్కడ చాలా మంది లేబర్లు ఆశ్రయం పొందుతున్నారు. షాపూర్జీ పల్లోంజి గ్రూప్ ఇక్కడ ఒక ప్రాజెక్టు నిర్మిస్తూ, ఆశ్రయం కల్పిస్తోంది. ఈ క్యాంపు బిల్డింగులో ఉన్నట్లుండి ఒక గ్యాస్ సిలిండర్ పేలింది. దీనివల్ల మరో ఆరింటితో కలిపి మొత్తం ఏడు గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ ఘటనతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనతో భయభ్రాంతులకు గురైన కార్మికులు కొందరు బయటకు పరుగెత్తారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 15 ఫైర్ ఇంజిన్లు, అంబులెన్సులు, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ప్రాణాహాని జరగలేదని డీసీపీ అభయ్సిన్హా దేశ్ముఖ్ తెలిపారు. అగ్నిప్రమాదంపై మరింత సమాచారం రావాల్సి ఉంది.