Viral news : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) నుంచి లక్నో (Lucknow) కు బయలుదేరిన విమానం రన్నింగ్లో ఉంది. ఓ ప్రయాణికుడు ఫోన్లో ఓ మహిళను దూషిస్తూ బూతు దండకం చదువుతున్నాడు. దాంతో ఓ మహిళా ప్రయాణికురాలు అభ్యంతరం తెలిపింది. దాంతో అతడు ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఆ విమానంలోనే ఉన్న ఓ ఎమ్మెల్యే (MLA) ఇది గమనించి సదరు వ్యక్తిని ప్రశ్నించాడు. దాంతో అతడు ఎమ్మెల్యేను సైతం నెట్టేసి దురుసుగా ప్రవర్తించాడు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు లక్నోలో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం ఎయిరిండియా విమానం AI-837 ఢిల్లీ నుంచి లక్నోకు బయలుదేరింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమేథీ లోక్సభ స్థానంలోని గౌరీగంజ్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రాకేశ్ ప్రతాప్సింగ్ కూడా ఆ విమానంలో ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన తర్వాత ఓ ప్రయాణికుడు ఫోన్లో గట్టిగా అరుస్తూ బూతులతో ఎవరో మహిళను దూషిస్తున్నాడు.
అయితే అతడి వెనుకే ఉన్న ఓ మహిళా ప్రయాణికురాలు అభ్యంతరం తెలిపింది. చిన్నగా మాట్లాడాలని రిక్వెస్ట్ చేసింది. దాంతో సదరు ప్రయాణికుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. మహిళా ప్రయాణికురాలితో వాగ్వాదానికి దిగాడు. ఇది గమనించిన ఎమ్మెల్యే అతడిని మందలించాడు. చిన్నగా మాట్లాడాలని సూచించాడు. ఎందుకు అరుస్తున్నావని ప్రశ్నించాడు.
దాంతో అతడు ఎమ్మెల్యేపై కూడా తిరగబడ్డాడు. నీకేం సంబంధం అంటూ నెట్టేశాడు. అసభ్యపదజాలంతో దూషించాడు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు లక్నో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడు ఫతేపూర్ జిల్లాకు చెందిన సమద్గా పోలీసులు గుర్తించారు.