చండీగఢ్: ఒక బాలుడికి తన భార్యతో అక్రమ సంబంధం ఉన్నట్లు ఆమె భర్త అనుమానించాడు. దీంతో 15 ఏళ్ల యువకుడ్ని ఒక చోటకు తీసుకెళ్లాడు. అక్కడ ఆ బాలుడికి డ్రగ్స్ ఇచ్చాడు. తన స్నేహితుడితో కలిసి గొంతు నొక్కి హత్య చేశాడు. (Man Kills Boy) దర్యాప్తు జరిపిన పోలీసులు ఆ వ్యక్తితోపాటు అతడి స్నేహితుడ్ని అరెస్ట్ చేశారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 26న ఖలీల్పూర్ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. దీంతో బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కాగా, అదే రోజున ఖలీల్పూర్ గిలావాస్ డ్యామ్ సమీపంలో బాలుడి మృతదేహం ఉన్నట్లు గురుగ్రామ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో అదృశ్యమైన యువకుడి మృతదేహంగా పోలీసులు గుర్తించారు. బాలుడి హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఖలీల్‌పూర్‌కు చెందిన 28 ఏళ్ల అమిత్ కుమార్, 29 ఏళ్ల అతడి స్నేహితుడు తరుణ్ అలియాస్ జోనిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. రెవారీ జిల్లాలోని చిల్హార్ గ్రామంలో ఉన్న వారిద్దరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
మరోవైపు బాలుడ్ని తామే హత్య చేసినట్లు ప్రధాన నిందితుడు అమిత్ కుమార్ ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. తన భార్యతో అతడికి అక్రమ సంబంధం ఉన్నట్లుగా అతడు అనుమానం వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఖలీల్పూర్ గిలావాస్ డ్యామ్ దగ్గరకు బాలుడ్ని తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చి హత్య చేశారని పోలీస్ అధికారి వివరించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి బాలుడి హత్యపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.