జైపూర్: తన భార్యతో అక్రమ సంబంధం(Affair With Wife) పెట్టుకున్నాడన్న అనుమానంతో సోదరుడిని చంపేశాడు. మృతదేహాన్ని ఓ క్వారీలో 10 అడుగుల గుంత తీసి పూచ్చిపెట్టాడు. గత నెల 27న రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగౌర్‌లోని భవండాకు చెందిన సోహన్‌రామ్ (29) తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తనకు సోదరుడు వసురసయ్యే ముకేశ్ గల్వా అనే వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నదని అనుమానిస్తున్నాడు. ఈ క్రమంలో ఆగస్టు 27న ముకేశ్‌ను సమీపంలోని భట్నోక్హా గ్రామంలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలు చూసొద్దామని తీసుకెళ్లాడు. రాత్రి పొద్దుపోయే వరకు ఇద్దరు అక్కడే ఉన్నారు. పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అక్కడి నుంచి బయల్దేరారు. నిర్మాణుశ్య ప్రదేశానికి అతడిని తీసుకెళ్లి.. ఇనుప రాడ్డుతో చచ్చేవరకు కొట్టాడు. అనంతరం తన క్వారీలో బుల్డోజర్తో 10 అడుగుల లోతు గుంత తీసి ముకేశ్‌ను పాతిపెట్టాడు. ఎవరూ గుర్తించకుండా బొందపై పెద్దపెద్ద బండరాళ్లు పెట్టేశాడు. అనంతరం ఏమీ తెలియనట్లుగా గ్రామానికి తిరిగి వచ్చాడు.
అయితే ముకేశ్ ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో పలువురిని విచారించగా సోహన్‌రామ్ పేరు చెప్పడంతో.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో అడగడంతో అసలు విషయం చెప్పాడు. దీంతో సోహన్రామ్పై హత్య కేసు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు చెప్పిన వివరాల ప్రకారం.. క్వారీలో నుంచి ముకేశ్ మృతదేహాన్ని బయటకు తీసి, పోస్టు మార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.