భోపాల్: తండ్రి మరణ వార్త తెలుసుకున్న పెద్ద కుమారుడు గ్రామానికి చేరుకున్నాడు. అంత్యక్రియలు తాను నిర్వహిస్తానని పట్టుబట్టాడు. తండ్రి చివరి కోరిక మేరకు దహన సంస్కారాలు చేస్తానన్న తమ్ముడితో గొడవ పడ్డాడు. ఈ నేపథ్యంలో తండ్రి మృతదేహాన్ని సగానికి కోసి పంచాలని డిమాండ్ చేశాడు. (Man Demands Half Of Father’s Body) చివరకు పోలీసుల జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగింది. మధ్యప్రదేశ్‌లోని తికమ్గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. లిధోరాతాల్ గ్రామంలో చిన్న కుమారుడు దేశ్‌రాజ్‌తో కలిసి నివసిస్తున్న 84 ఏళ్ల ధ్యానీ సింగ్ ఘోష్, దీర్ఘకాలిక అనారోగ్యంతో ఆదివారం మరణించాడు. మరో ఊరిలో నివసించే పెద్ద కుమారుడు కిషన్ తండ్రి మరణ వార్త తెలిసి ఆ గ్రామానికి చేరుకున్నాడు.
కాగా, మద్యం మత్తులో ఉన్న కిషన్ తండ్రికి అంత్యక్రియలు తాను నిర్వహిస్తానని పట్టుబట్టాడు. అయితే తండ్రి చివరి కోరిక మేరకు తాను నిర్వహిస్తానన్న తమ్ముడు దేశ్‌రాజ్‌తో అతడు గొడవపడ్డాడు. గ్రామస్తులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ వారి మాట వినలేదు. తండ్రి మృతదేహాన్ని సగానికి కోసి తమ ఇద్దరు సోదరులకు పంచాలని కిషన్ డిమాండ్ చేశాడు.
మరోవైపు కిషన్ తన పట్టు వీడకపోవడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు కిషన్‌కు నచ్చజెప్పారు. దీంతో అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం చిన్న కుమారుడు తండ్రి మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.