తిరువనంతపురం: ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తుండగా ఎస్ఐ చెవిని అతడు కొరికాడు. దీంతో ఆ పోలీస్ అధికారి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేరళలోని కాసరగాడ్‌లో ఈ సంఘటన జరిగింది. గురువారం రాత్రి కాసరగాడ్‌లో బైక్‌పై వెళ్తున్న స్టెనీ రోడ్రిగ్జ్ అనే వ్యక్తి ఒక వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ వ్యాన్‌లో పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు.
కాగా, ఎస్ఐ విష్ణు ప్రసాద్ పోలీస్ వ్యాన్ ముందు సీటులో కూర్చొన్నారు. అయితే వెనుక కూర్చొన్న ఆ వ్యక్తి ఉన్నట్టుండి ఆయన కుడి చెవిని గట్టిగా కొరికాడు. దీంతో ఆ ఎస్ఐకు తీవ్ర గాయమైంది. ఆయనను తొలుత స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు రోడ్డుపై ప్రమాదం చేయడంతోపాటు ఎస్ఐ చెవి కొరికిన నిందితుడు స్టెనీ రోడ్రిగ్జ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.