గడ్చిరోలి, నవంబర్ 1: నక్సలైట్లు తమ ఆయుధాలను త్యజించి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని, గత నెలలో గడ్చిరోలి పోలీసులకు లొంగిపోయిన నక్సలైట్ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు, అలియాస్ భూపతి కామ్రేడ్లకు పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో భాగంగా శనివారం గడ్చిరోలి పోలీసుల ద్వారా ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన తన, లొంగిపోయిన మరో నక్సలైట్ రూపేష్ మొబైల్ నెంబర్ను ఇస్తూ ఉద్యమాన్ని వీడి లొంగిపోవాలనుకునే వారు ఈ నెంబర్లలో సంప్రదించవచ్చునని తెలిపారు.
భూమి, అధికారం కోసం సాయుధ పోరాటం చేస్తున్న కామ్రేడ్లు ‘విఫల మార్గం’లో పయనిస్తున్నారని, తమ చర్యలు వారిని ప్రజల నుంచి దూరం చేశాయన్న విషయాన్ని అర్థ్ధం చేసుకోవాలని అన్నారు. ‘క్రియాశీల నక్సల్స్ వెంటనే తమ హింసా కార్యకలాపాలకు స్వస్తి పలికి, ఆయుధాలతో లొంగిపోయి, ప్రధాన స్రవంతిలో కలిసి జనంతో మమేకమవ్వాలి’ అని మల్లోజుల కోరారు. ‘పరిస్థితి మారిపోయింది. మావోయిస్టులు ఆయుధాలు వదిలి ఉద్యమాన్ని విడిచిపెట్టి చట్టం పరిధిలో పనిచేయాల్సిందే’ అని ఆయన నొక్కి చెప్పారు. దేశంలోని మేధావులు, ప్రజాస్వామ్య ప్రేమికులు, గిరిజన శ్రేయోభిలాషులు తమ నిర్ణయాన్ని అర్థం చేసుకుని మద్దతు ఇవ్వాలని మల్లోజుల వేణుగోపాల్ రావు విజ్ఞప్తి చేశారు.