Kolkata doctor case : పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో ట్రెయినీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఘటనను నిరసిస్తూ దేశమంతటా ఆందోళనలు జరిగాయి. జూనియర్ డాక్టర్లంతా కలిసి ఓపీ సేవలను కూడా బహిష్కరించారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులు ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉండి కేసు విచారణను ఎదుర్కొంటున్న సంజయ్ రాయ్ జైలు సిబ్బంది పెట్టే ఆహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. సిబ్బంది రోజూ రోటీ సబ్జీ ఇస్తుండటంపై సంజయ్ ఒకింత కోపం వ్యక్తం చేసినట్టు సమాచారం. ‘రోజూ రోటీలేనా.. నాకు ఎగ్ నూడుల్స్ కావాలి’ అని రాయ్ డిమాండ్ చేసినట్లు ఓ జాతీయ మీడియా సంస్థ తన కథనంలో పేర్కొంది.
జైల్లో అందరికీ ఒకే ఆహారం ఇస్తామని, నీ కోసం ప్రత్యేకంగా అడిగింది తెచ్చివ్వడం కుదరదని జైలు సిబ్బంది కూడా అంతే కోపంగా చెప్పడంతో.. సంజయ్ రాయ్ నోరు మూసుకుని రోటీ సబ్జీ తీసుకున్నట్లు ఆ జాతీయ మీడియా సంస్థ తెలిపింది. కాగా కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రెయిన్ డాక్టర్‌పై అత్యాచారం చేసి, కిరాతకంగా హతమార్చారు. ఈ ఘటనలో సంజయ్ రాయ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.