Kodanadu case : ఏడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కొడనాడు హత్య, దోపిడీ కేసులో మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ కేసుకు సంబంధించి ప్రతిపక్ష ఏఐఏడీఎంకే నేత ఎడప్పొడి పళనిస్వామి, శశికళ తదితరులను విచారించేందుకు సీబీసీఐడీ పోలీసులకు అనుమతినిచ్చింది. వారిద్దరినీ విచారించకుండా ఊటీలోని జిల్లా కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను కోర్టు కొట్టివేసింది.
కొడనాడు ఎస్టేట్‌లో 2017లో పోలీసులు దాదాపు ఐదేళ్లపాటు దర్యాప్తు జరిపినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. ప్రభుత్వం మారిన తర్వాత కేసును సీఐడీకి అప్పగించారు. ఈ కేసులో ఇప్పటివరకు 10 మందిని అరెస్టు చేశారు. సుమారుగా 100 మందిని విచారించారు. అయితే కేసులో పళనిస్వామి, శశికళను విచారించేందుకు గతంలో దిగువ కోర్టు అనుమతి ఇవ్వలేదు.
దాంతో వారిని కూడా విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సీబీసీఐడీ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఆ ఇద్దరి విచారణకు అనుమతిస్తూ ఆదేశాలు జారీచేసింది. అంతేకాకుండా ఎస్టేట్‌లో కనిపించకుండా పోయిన కొన్ని విలువైన వస్తువుల గురించి శశికళ, ఇళవరసిని ప్రశ్నించాలని ఆర్డర్ వేసింది.
కాగా, 2017లో తమిళనా మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి కాపలాదారుడు ఓం బహదూర్‌ను హత్యచేశారు. ఎస్టేట్‌లోని పలు వస్తువులన దోచుకెళ్లారు.