రాంచీ: రైలు 8 గంటలకుపైగా ఆలస్యంగా నడవడంతో ప్రయాణికునికి శారీరక, మానసిక, ఆర్థిక ఇబ్బందులు కలిగాయని పేర్కొంటూ, రూ.35 వేల పరిహారం చెల్లించాలని దక్షిణ తూర్పు రైల్వేను జార్ఖండ్‌లోని వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. ఇందులో రూ. 30 వేల పరిహారం, రూ. 5 వేల న్యాయపరమైన ఖర్చులు ఉన్నాయి.
‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం ప్రకారం సెరైకెల్లా జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఈ మేరకు తీర్పునిచ్చింది. 2024 సెప్టెంబర్‌లో టాటానగర్ నుంచి సంబల్పూర్ వెళ్లేందుకు ప్రయాణికుడు ఇస్పాత్ ఎక్స్‌ప్రెస్‌లో రెండు స్లీపర్ క్లాస్ టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ రైలు టాటానగర్ నుంచి ఉదయం 10:18 గంటలకు బయలుదేరి, మధ్యాహ్నం 3:50 గంటలకు సంబల్పూర్ చేరుకోవాల్సి ఉంది.
అయితే రైలు నిర్ణీత సమయానికన్నా 8 గంటల 48 నిమిషాల ఆలస్యంగా గమ్యానికి చేరింది. దీంతో ప్రయాణికుడు తాను శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నానని పేర్కొంటూ, ఇందుకు పరిహారంగా రూ. 4.5 లక్షల మొత్తాన్ని రైల్వేశాఖ చెల్లించాలని కోరుతూ, వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. తొలుత రైల్వేశాఖ వినియోగదారుని వాదనను తోసిపుచ్చింది. అయితే వినియోగదారుల ఫోరం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ కేసును పరిష్కరించింది.