పాట్నా: ఆర్జేడీ ఎమ్మెల్యే, అతడి సోదరులు తనను కిడ్నాప్ చేసి కొట్టారని, బలవంతంగా మూత్రం తాగించారని జేడీయూ నేత ఆరోపించారు. (JDU leader accuses RJD MLA) గాయపడిన ఆయన ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్జేడీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. అయితే ఈ ఆరోపణలను ఆయన ఖండించారు. బీహార్‌లోని పూర్నియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అధికార జేడీయూకు చెందిన బైసీ బ్లాక్ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ రెహాన్ ఫజల్, ఆర్జేడీకి చెందిన బైసి ఎమ్మెల్యే సయ్యద్ రుక్నుద్దీన్ అహ్మద్‌పై పలు ఆరోపణలు చేశారు. దళిత మహిళకు సంబంధించిన భూ వివాదంలో తనను కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. తనను బైక్‌పై ఎక్కించుకుని ఎమ్మెల్యే నివాసానికి తీసుకెళ్లి రాడ్లు, కర్రలతో దారుణంగా కొట్టారని, తాగేందుకు నీళ్లు అడిగితే బలవంతంగా మూత్రం తాగించినట్లు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, తీవ్రంగా గాయపడిన జేడీయూ నేత మొహమ్మద్ రెహాన్ ఫజల్, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేశారు. సేకరించిన ఆధారాల మేరకు ఆర్జేడీ ఎమ్మెల్యే సయ్యద్ రుక్నుద్దీన్, అతడి ఐదుగురు సోదరులపై పలు సెక్షన్ల కింద పూర్నియా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్జేడీ ఎమ్మెల్యే అరెస్ట్ కోసం వారెంట్ జారీ చేస్తామని ఎస్పీ తెలిపారు.
మరోవైపు జేడీయూ నేత మొహమ్మద్ రెహాన్ ఫజల్ ఆరోపణలను ఆర్జేడీ ఎమ్మెల్యే సయ్యద్ రుక్నుద్దీన్ తోసిపుచ్చారు. ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితం, నిరాధారమైనవని అన్నారు. తాను కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. 2022లో ఏఐఎంఐఎం నుంచి ఆర్జేడీలోకి ఆయన చేరారు.