న్యూఢిల్లీ, మే 23: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకాను హత్య చేయడానికి పన్నిన కుట్ర బయటపడింది. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) శిక్షణ పొందిన ఒక ఉగ్రవాది ఈ కుట్ర పన్నినట్లు ది న్యూయార్క్ పోస్ట్ కథనం పేర్కొంది. మహమ్మద్ బాఖర్ సాద్ దావూద్ అల్-సాది అనే ఆ ఉగ్రవాది అమెరికా దాడుల్లో తన గురువు మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నట్లు పత్రిక పేర్కొంది.
ఇరాన్ సైనికాధిపతి ఖాసెమ్ సులేమానీని హతమార్చినందుకు ప్రతీకారంగా ఇవాంకాను హత్యచేయాలని అల్-సాది(32) ప్రతిజ్ఞ చేశాడు. 2021లో ఇవాంకా, ఆమె భర్త జారెడ్ కుష్నర్ నివసిస్తున్న భవనం మ్యాప్ చిత్రాన్ని అల్-సాది ఎక్స్‌లో పోస్టు చేశాడని అధికారులు తెలిపారు. ప్రతీకారం తీర్చుకునే సమయం వస్తున్నది అనే హెచ్చరికనూ పేర్కొన్నాడని వెల్లడించారు.