న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముందు.. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది(ISIS Terrorist) రిజ్వాన్ అలీని .. ఢిల్లీ పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. ఢిల్లీలోని దరియాగంజ్ అతని నివాస స్థలం. ఉగ్రవాది కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు రిజ్వాన్ అలీపై ఆరోపణలు ఉన్నాయి. ఎన్ఐఏ అతనిపై ప్రత్యేకంగా నిఘా పెట్టింది. గురువారం రాత్రి అతన్ని అరెస్టు చేశారు. తుగ్లకాబాద్‌లోని బయోడైవర్సిటీ పార్క్‌కు రిజ్వాన్ వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ సమాచారన్ని తెలుసుకున్న స్పెషల్ సెల్ పోలీసులు ట్రాప్ చేసి అతన్ని పట్టుకున్నారు.
అతని వద్ద నుంచి .30 బోర్ స్టార్ పిస్తోల్‌తో పాటు మూడు లైవ్ కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. రెండు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. ఆ ఫోన్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. రిజ్వాన్ సమాచారం ఇస్తే మూడు లక్షలు ఇస్తామని గతంలో ఎన్ఐఏ ప్రకటించింది. ఐసిస్‌తో లింకు ఉన్న అతను పుణె మాడ్యూల్లో స్పెషలిస్టు. ఢిల్లీలో ఉండే వీఐపీ ప్రాంతాల్లో రిజ్వాన్‌తో పాటు అతని అనుచరులు రెక్కీ వేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఐసిస్‌తో లింకులు ఉన్న కారణంగా.. ఇప్పటికే అతనిపై కఠినమైన యూఏపీఏ చట్టం కింద కేసు బుక్ చేశారు. యూఏపీఏతో పాటు ఎక్స్‌ప్లోజివ్ యాక్టు కింద అతనిపై కేసు నమోదు చేశారు. రిజ్వాన్ అరెస్టు నేపథ్యంలో.. నగరంలో భద్రతను పెంచారు. ఢిల్లీతో పాటు పంజాబ్‌లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు.