Uttarpradesh BJP : లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ పేలవ ప్రదర్శన ఆ పార్టీలో విబేధాలకు దారితీసినట్లు తెలుస్తున్నది. గత రెండు పర్యాయాల్లో (2014, 2019) యూపీలోని మెజారిటీ సీట్లను దక్కించుకున్న బీజేపీ.. 2024లో మాత్రం దారుణమైన ఫలితాలను చవిచూసింది. ముఖ్యంగా ప్రతిష్ఠాత్మక రామమందిరం ఉన్న ఫైజాబాద్ స్థానంలో బీజేపీ ఓడిపోవడం ఆ పార్టీని మరింత దెబ్బతీసింది.
మొత్తం 80 ఎంపీ సీట్లున్న యూపీలో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ కలిసి 43 సీట్లను గెలుచుకోగా.. బీజేపీ కేవలం 36 చోట్ల మాత్రమే విజయం సాధించింది. త్వరలో యూపీలో 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న ఉప ఎన్నికల కోసం బీజేపీ కార్యచరణ సిద్ధం చేసుకుంటోంది. ఇటీవల 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా బీజేపీ కేవలం 2 స్థానాలను మాత్రమే పరిమితమైంది.
ఈ నేపథ్యంలో యూపీ ఉప ఎన్నికల్లో గెలుపు బీజేపీకి కీలకంగా మారింది. యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మంగళవారం బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రిని మారుస్తారని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకున్నది. మరోవైపు బీజేపీ యూపీ చీఫ్ భూపేంద్ర చౌదరి కూడా జేపీ నడ్డాతో భేటీ అయ్యారు.
మరోవైపు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన మంత్రులతో ఇవాళ సమావేశమయ్యారు. నిజాయితీగా ఉండి గెలువగల అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని, వారి ఇమేజ్‌కు, ప్రజలతో వారికి ఉన్న సంబంధాలకు ప్రాధాన్యం ఇవ్వబడుతుందని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో చెప్పినట్లు తెలుస్తోంది. మంత్రులందరూ వారివారి నియోజకవర్గాల్లో స్థానిక విషయాలపై అభిప్రాయాలు తెలుసుకోవాలని, అభ్యర్థులను అంచనా వేయాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం.
గత వారం లక్నోలో జరిగిన బీజేపీ యూపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో కేశవ్ ప్రసాద్ మౌర్య మాట్లాడుతూ.. ప్రభుత్వం కంటే ఆర్గనైజేషన్ ఎప్పుడూ పెద్దదని వ్యాఖ్యానించారు. అదే సమావేశంలో యోగి ప్రసంగిస్తూ.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అంచనాలు, అతి ఆత్మవిశ్వాసం యూపీలో పార్టీ ఓటమికి కారణమని వ్యాఖ్యలు చేశారు. దాంతో పార్టీకి, యూపీ ప్రభుత్వానికి మధ్య సమన్వయం దెబ్బతినేలా నేతల ఎలాంటి ప్రకటనలు చేయవద్దని జేపీ నడ్డా సూచించారు.