IRCTC Down | దీపావళి దగ్గర పండుగ దగ్గరపడుతున్నది. ఈ క్రమంలో చాలామంది తమ సొంత ప్రాంతాలకు వెళ్తుంటారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు రైలులో ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే, పండుగకు ముందు లక్షలాది మంది టికెట్లను బుక్ చేసుకునేందుకు ప్రయత్నించడంతో ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్ మొరాయించాయి. రెండు సర్వర్లు డౌన్ అయ్యాయి. ఏసీ తత్కాల్ టికెట్ల బుకింగ్ సాధారణంగా ఉదయం 10 గంటలకు, స్లీపర్ క్లాస్ టికెట్లు ఉదయం 11 గంటలకు మొదలవుతాయి. అయితే, శుక్రవారం టికెట్ల బుకింగ్ ప్రారంభానికి ముందే వెబ్‌సైట్‌తో పాటు యొబైల్ యాప్స్ పని చేయలేదు. దాంతో టికెట్లు బుక్ చేసుకోవాలనుకున్న ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసిన సమయంలో సాంకేతిక కారణాలతో బుకింగ్, టికెట్ల రద్దు ఫెసిలిటీ కొద్దిగంటల పాటు అందుబాటులో ఉండదని.. టీడీఆర్, టికెట్ల రద్దుకు సంబంధించిన సహాయం కోసం ప్రయాణికులు 08044647999, 08035734999 నంబర్లలో లేదంటే etickets@rcte.co.in కు ఇమెయిల్ పంపాలని సూచించింది.
చాలామంది వెబ్‌సైట్‌ను ఓపెన్ చేస్తే సర్వర్ ఎర్రర్, పేజీ నాట్ రెస్పాండింగ్ అంటూ మెస్సేజ్ వచ్చిందని పేర్కొన్నారు. ఐఆర్‌సీటీ, యాప్ పని చేయకపోవడానికి కారణాలు తెలియరాలేదు. తత్కాల్ టికెట్ టికెట్లను బుక్ చేసుకునేందుకు లక్షలాది మంది వినియోగదారులు ఒకేసారి లాగిన్ అవడంపై కారణంగా భావిస్తున్నారు. దీపావళి, ఛత్ పూజ కోసం తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. వెబ్సైట్ ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్ డౌన్ డిటెక్టర్‌లో వెబ్సైట్, యాప్ పని చేయడం లేదని 5వేల మందికిపైగా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం వెబ్‌సైట్‌కి లాగిన్ అయినప్పటికీ.. కొంతమంది వినియోగదారులు సమస్యలు ఎదురవుతున్నట్లుగా పేర్కొన్నారు. పండుగ సీజన్లో రైలు టికెట్లకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో.. సాంకేతిక సమస్యతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులుపడ్డారు. అయితే, పండుగ సమయంలో ఐఆర్‌సీటీఐ వెబ్సైట్, యాప్స్ పని చేయకపోవడం ఇదే తొలిసారి ఏం కాదు. గతంలోనూ మూడునాలుగు సార్లు పండుగల సీజన్లో సాంకేతిక లోపంతో టికెట్ల బుకింగ్ నిలిచిపోయింది.