ప్రతి ఏటా పార్లమెంట్లో ఆర్థిక మంత్రులు బడ్జెట్ ప్రవేశపెట్టడం మనం చూస్తుంటాం. అయితే, బడ్జెట్‌కు సంబంధించిన అవగాహన మనలో చాలా మందికి లేదనే చెప్పాలి. బడ్జెట్‌ను ఎంత చదివినా ఎక్కడో ఒక చోట సందేహం వస్తుంటుంది. మరికొన్ని గంటల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను సమర్పించనున్నారు. దేశం మొత్తం దృష్టి బడ్జెట్‌పైనే ఉన్నది. ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెట్టడం అంటే.. దేశ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన ఖాతాను సమర్పించడమే కాకుండా, రోడ్‌మ్యాప్‌ను కూడా సెట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో అసలింతకీ ఏంటీ బడ్జెట్..? ఎలా తయారుచేస్తారు..? దీనికి ఎందుకంత ప్రాధాన్యం..? అనే కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం, కేంద్ర బడ్జెట్ అనేది దేశ వార్షిక ఆర్థిక ఆడిట్.
కేంద్ర బడ్జెట్ అనేది ఒక నిర్దిష్ట సంవత్సరానికి ప్రభుత్వ ఆదాయాలు, ఖర్చుల అంచనా ప్రకటన. ప్రభుత్వం బడ్జెట్ ద్వారా నిర్దిష్ట ఆర్థిక సంవత్సరానికి దాని అంచనా ఆదాయాలు, ఖర్చుల వివరాలను అందజేస్తుంది. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది.మన దేశంలో ఆర్థిక సంవత్సర కాలం ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉండేది. ఇప్పుడు దానికి ఫిబ్రవరి 1 కి మార్చారు. ఈ కాలానికి కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తారు.
వాస్తవానికి ఈ బడ్జెట్ ద్వారా రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలతో పోల్చితే ఎంత మేరకు ఖర్చు చేయవచ్చునో నిర్ణయించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పవచ్చు. బడ్జెట్ తయారీ 6 నెలల ముందుగానే అంటే సాధారణంగా సెప్టెంబర్ నెలలో సన్నాహాలు ప్రారంభిస్తారు.
ఒక నిర్దిష్ట సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తులు లేదా సేవల ప్రస్తుత మార్కెట్ విలువను స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంటారు. బడ్జెట్ తయారీ అనేది దీని మీదనే ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి జీడీపీ లేకుండా బడ్జెట్ తయారు చేయడం అసాధ్యం. జీడీపీ తెలియకుండా ద్రవ్య లోటును ఎంత ఉంచుకోవాలో ప్రభుత్వం నిర్ణయించదు. అలాగే, జీడీపీ లేకుండా రాబోయే ఏడాదిలో ప్రభుత్వం ఎంత ఆర్జించనున్నదో కూడా ప్రభుత్వం తెలుసుకోలేదు. ఆదాయాన్ని అంచనా వేయకుండా ఏ పథకానికి ఎంత ఖర్చు చేయాలో కూడా నిర్ణయించడం ప్రభుత్వానికి కష్టమవుతుంది.
1947 నవంబర్ 26 న స్వతంత్ర భారత తొలి బడ్జెట్‌ను షణ్ముఖం చెట్టి ప్రవేశపెట్టారు.
అనంతరం ఆర్థిక మంత్రిగా పనిచేసిన జాన్ మథాయ తొలి ఉమ్మది భారత బడ్జెట్ తీసుకొచ్చారు.
1955 వరకు బడ్జెట్ ప్రతులను కేవలం ఇంగ్లిష్ భాషలోనే ముద్రించేవారు.
1956 నుంచి హిందీ భాషలో కూడా బడ్జెట్ ప్రతులను ముద్రించడం ప్రారంభించారు.
2016 వరకు ఫిబ్రవరి నెల చివరి రోజున బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు.
2017 నుంచి ఫిబ్రవరి 1 వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం మొదలుపెట్టారు.
2016 వరకు రైల్వే బడ్జెట్‌ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టేవారు.
2017 నుంచి రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్లో కలిపి ప్రవేశపెట్టడం ప్రారంభించారు.
1999 కు ముందు వరకు బడ్జెట్‌ను సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు.
1999 నుంచి బడ్జెట్‌ను ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ముందు ఉంచుతున్నారు.
1970 లో బడ్జెట్‌ను సమర్పించి ఇందిరా గాంధీ తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నిలిచారు.
2020 లో నిర్మలా సీతారామన్ ఏకంగా 2 గంటల 40 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేశారు.
1977 లో హెచ్ఎం పటేల్ కేవలం 800 పదాలతో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
1950-51 లో తొలిసారి ఆర్థిక సర్వేను విడుదల చేశారు.
1964 వరకు ఆర్థిక సర్వేను బడ్జెట్‌తో పాటు ప్రవేశపెట్టేవారు. 1965 నుంచి ఆర్థిక సర్వేను బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒకరోజు ముందు విడుదల చేస్తున్నారు.
1947 నుంచి ఇప్పటి వరకు మొత్తం 73 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు.
మొరార్జీ దేశాయ్ – 10 సార్లు
పీ చిదంబరం – 9 సార్లు
ప్రణబ్ ముఖర్జీ – 9 సార్లు
యశ్వంత్రావ్ చౌహాన్ – 7 సార్లు
సీడీ దేశ్‌ముఖ్ – 7 సార్లు
యశ్వంత్ సిన్హా – 7 సార్లు
మన్మోహన్ సింగ్ – 6 సార్లు
టీటీ కృష్ణమాచారి – 6 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
దేశంలో 2020 నుంచే పేపర్‌లెస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం మొదలుపెట్టారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020, 2021 లో పేపర్‌లెస్ బడ్జెట్‌ను సమర్పించారు. 2018 కన్నా ముందు బడ్జెట్ పత్రాలను బ్రీఫ్ కేసులో తీసుకురావడం మొదలుపెట్టారు. 2019 లో నిర్మలా సీతారామన్ తొలిసారి ఒక ఫైల్లో బడ్జెట్ పత్రాలను తీసుకొచ్చారు. 2020 లో పేపర్‌లెస్ బడ్జెట్‌ను సమర్పించేందుకు నిర్మలా సీతారామన్.. బ్రీఫ్ కేసు, ఫైల్‌కు బదులుగా ట్లాబ్లెట్ను వినియోగించారు.