న్యూఢిల్లీ, జనవరి 7: ఐటీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఓసారి అమెరికాలో క్లయింట్ ఇచ్చిన చిన్న స్టోర్ రూమ్‌లో.. చుట్టూ అట్టపెట్టెలతో కంగాళీగా ఉండి, కిటికీ కూడా లేని గదిలో చెక్కబల్లపై నిద్రపోయిన విషయం మీకు తెలుసా? ఇండియన్ అమెరికన్ రచయిత్రి చిత్రా బెనర్జీ దివాకరునీ రాసిన నారాయణమూర్తి జీవిత కథ ‘యాన్ అన్ కామన్ లవ్: ద ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణమూర్తి’ పుస్తకంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇన్ఫోసిస్ స్థాపించిన తొలినాళ్లలో ఎదురైన ఇలాంటి అవమానాల నుంచి వివాహం వరకు పలు విషయాలను ఇందులో చర్చించారు. ఇన్ఫోసిస్ స్థాపించిన మొదట్లో న్యూయార్క్‌కు చెందిన డాన్ లిలెస్ కంపెనీ డాటా బేసిక్స్ కార్పొరేషన్ ఇన్ఫోసిస్‌కు క్లయింట్‌గా ఉండేది. డాన్ తరచూ చెల్లించాల్సిన సొమ్మును ఆలస్యం చేస్తూ నారాయణమూర్తిని ఇబ్బందులకు గురిచేసేవాడు. మూర్తి ఆయన ఇన్ఫోసిస్ సహచరులు మాన్హటన్ వెళ్లిన ప్రతిసారి డాన్ వారిని ఇబ్బందులు పెట్టేవాడు.
హోటల్ రూమ్స్ బుక్ చేసేవాడు కాదు. ఒకసారి మూర్తి డాన్ వద్దకు వెళ్లినప్పుడు నారాయణమూర్తి చేదు అనుభవం ఎదుర్కొన్నారు. డాన్ ఇంట్లో నాలుగు బెడ్రూములు ఉంటే మూర్తికి మాత్రం తన ఇంటిలో కిటికీ కూడా లేని స్టోర్ రూమ్ ఇచ్చాడు. అది మొత్తం చెత్తకుప్పలా ఉంది. అయినా సరే అందులోనే ఓ పెద్దబాక్సుపై ఆయన నిద్రపోయినట్టు చిత్రా బెనర్జీ ఆ పుస్తకంలో రాసుకొచ్చారు. అయినప్పటికీ మూర్తి డాన్‌కు అత్యవసర సమయంలోనూ ఆయన డిమాండ్లు నెరవేర్చి పెట్టారని అందులో పేర్కొన్నారు.
“మా అమ్మ అతిథులను దైవంలా భావించేది. మా నాన్న ముందస్తు సమాచారం లేకుండా అతిథులను తీసుకొచ్చినప్పుడు కూడా ఏమాత్రం విసుక్కోకుండా వారికి సేవలు చేసేది. ఆమె ఆహారాన్ని కూడా వారికి పెట్టి తాను తినకుండానే నిద్రపోయేది. కానీ ఇక్కడ డాన్ మాత్రం ఖరీదైన, విలాసవంతమైన బెడ్‌పై పడుకుని తనను మాత్రం ఆ రాత్రి చిన్న బాక్స్‌పై, కిటికీలు లేని స్టోర్రూములో నిద్రపోయేలా చేశాడు” అని భార్య సుధామూర్తితో చెప్పిన విషయాన్ని చిత్ర ఆ పుస్తకంలో ప్రస్తావించారు.