లక్నో: వడగళ్ల వాన కారణంగా ఇండిగో విమానం ముందు భాగం దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. అందులోని ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు ఆ సంస్థ పేర్కొంది. (IndiGo Flight) అక్టోబర్ 7న ఇండిగోకు చెందిన 6ఈ 625 విమానం బీహార్ రాజధాని పాట్నా నుంచి ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు బయలుదేరింది. అయితే లక్నో ఎయిర్పోర్ట్ సమీపిస్తున్న సమయంలో ఆ విమానం 17,000 అడుగుల ఎత్తులో ఉండగా వడగళ్ల వర్షం వల్ల ముందు భాగం దెబ్బతిన్నది. దీంతో నిర్ణీత సమయం కంటే ఎనిమిది నిమిషాల ముందే లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.
కాగా, ఆ విమానంలోని 104 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ తెలిపింది. విమానం 17,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు వడగళ్ల వాన తాకిడికి గురి కావడంతో రాడోమ్ దిబ్బతిన్నట్లు పేర్కొంది. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో వడగళ్ల వానతో సహా ప్రతికూల వాతావరణాన్ని ఆ విమానం ఎదుర్కొన్నట్లు వివరించింది. అయితే ప్రయాణికులంతా సురక్షితంగా వారి గమ్యస్థానంలో దిగినట్లు వెల్లడించింది.
మరోవైపు ముందు భాగం దెబ్బతిన్నడం వల్ల ఆ విమానాన్ని నిలిపివేసినట్లు ఇండిగో సంస్థ అధికారి తెలిపారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు ఈ సమాచారం ఇవ్వడంతో పాటు ఈ సంఘటనపై విచారణ ప్రారంభించినట్లు చెప్పారు. ఆ విమానానికి అవసరమైన నిర్వహణ పనులు జరుగుతున్నాయని వివరించారు. సంబంధిత అనుమతులు పొందిన తర్వాత ఆ విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు.