Dolo 650 | న్యూఢిల్లీ: భారతీయులు డోలో 650 మాత్రలను క్యాడ్బరీ జెమ్స్‌లా తినేస్తున్నారని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెల్త్ ఎడ్యుకేటర్ పలనియప్పన్ మానిక్కం సామాజిక మాధ్యమంలో వ్యాఖ్యానించారు. ఇది వైరల్‌గా మారింది. తమ ఇంటిలోనూ ఇదే పరిస్థితి అని చాలా మంది కామెంట్లు పెట్టారు. కొవిడ్-19 మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఈ మాత్రల వాడకం పెరిగింది. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు తగ్గడానికి వైద్యులు దీనిని సూచిస్తారు. అయితే ఇందులోని పారాసిటమాల్‌తో కిడ్నీ, కాలేయం దెబ్బతింటాయి.
వైద్యులు సూచించిన మోతాదులోనే వాడాలి. కొవిడ్-19 మహమ్మారి సమయంలో టీకాలను తీసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్‌ను ఎదుర్కొనడం కోసం పారాసిటమాల్‌ను వాడాలని వైద్యులు చెప్పేవారు. 2020లో మైక్రో ల్యాబ్స్ 350 కోట్లకుపైగా డోలో 650 మాత్రలను విక్రయించి, ఓ సంవత్సరంలోనే రూ.400 కోట్లు సంపాదించింది. మార్కెట్ పరిశోధన సంస్థ ఐక్యూవీఐఏ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ మహమ్మారి రావడానికి ముందు మైక్రో ల్యాబ్స్ ఏటా 7.5 కోట్ల డోలో 650 స్ట్రిప్‌లను విక్రయించేది. 2021 చివరినాటికి 14.5 కోట్ల స్ట్రిప్స్‌ను విక్రయించింది.