న్యూఢిల్లీ: అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయ సంతతి టెకీ(Indian Techie) పారిశ్రామికవేత్త హర్షవర్ధన్ తన భార్య, కుమారుడిని చంపేశాడు. ఈ ఘటన వాషింగ్టన్ సమీపంలోని న్యూకాసిల్లో జరిగింది. ఏప్రిల్ 24వ తేదీన మర్డర్ జరిగినట్లు భావిస్తున్నారు. భార్య, కొడుకును చంపిన తర్వాత ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హత్య జరిగిన సమయంలో మరో కొడుకు వేరేచోట ఉన్నాడు. హర్షవర్దన్ భార్య శ్వేతా పాన్యం, 14 ఏళ్ల కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. హత్యకు దారి తీసిన కారణాలు ఇంకా తెలియరాలేదు. మర్డర్ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నిజానికి ఆ కుటుంబం స్నేహపూర్వకంగా ఉంటుందని, కానీ రిజర్వ్‌గా ఉంటారని పొరుగువాళ్లు చెబుతున్నారు. కర్నాటకలోని మాండ్య జిల్లాకు చెందిన కేఆర్ పేట్ తాలూక హర్షవర్దన్ స్వగ్రామం. మైసూరుకు చెందిన రోబోటిక్స్ కంపెనీ హోలోవరల్డ్ సీఈవో హర్షవర్దన్ ఉన్నారు. ఆ కంపెనీ సహ వ్యవస్థాపకురాలిగా అతని భార్య కొనసాగుతున్నారు. 2017లో హర్షవర్దన్, శ్వేత జంట హోలోవరల్డ్ కంపెనీ స్థాపించారు. కోవిడ్19 వల్ల 2022లో ఆ కంపెనీ మూసివేశారు.
ఓ దశలో ప్రధాని మోదీతో హర్షవర్ధన్ భేటీ అయ్యారు. బోర్డర్ భద్రతలో రోబోలను వినియోగించే అంశంపై చర్చించారు. రోబోటిక్స్‌లో నిపుణుడైన హర్షవర్ధన్ గతంలో అమెరికాలోని మైక్రోసాఫ్ట్ సంస్థలో పనిచేశాడు.