న్యూఢిల్లీ: భారతీయ సంతతికి చెందిన మహిళ క్రిషాంగి మేష్రామ్( Krishangi Meshram)కు అరుదైన గౌరవం దక్కింది. ఇంగ్లండ్ అండ్ వేల్స్లో అత్యంత పిన్నవయసున్న సొలిసిటర్గా ఆమె క్వాలిఫై అయ్యారు. 21 ఏళ్ల వయసులోనే ఆమె యంగెస్ట్ సోలిసిటర్ అయ్యారు. అకాడమిక్, ప్రొఫెషనల్ కెరీర్లో ఆమె అత్యుద్భుతంగా రాణించారు. 15 ఏళ్ల వయసు నుంచే క్రిషాంగి .. న్యాయ విద్యలో అందరి దృష్టిని ఆకర్షించారు.
పశ్చిమ బెంగాల్లో క్రిషాంగి పెరిగింది. ప్రస్తుతం ఆమె యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉంటోంది. ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఆమె న్యాయ విద్యను అభ్యసించింది. లెర్నింగ్ మోడల్ అనుకూలంగా ఉండడంతో… క్రిషాంగి ఎల్ఎల్బీ విద్యలో యూనివర్సిటీ టాప్‌గా నిలిచారు. 18 ఏళ్ల వయసు వచ్చే లోగా ఆమె న్యాయ విద్యలో ఫస్ట్ క్లాస్ హానర్స్ డిగ్రీ పొందారు. చాలా చురుకుగా, వేగంగా ఆమె న్యాయవృత్తిలో దూసుకెళ్లింది. 15 ఏళ్ల వయసులోనే ఎల్ఎల్బీ చదువుకునే అవకాశాన్ని ఓపెన్ యూనివర్సిటీ కల్పించిందని, దానికి థ్యాంక్స్ చెబుతున్నట్లు ఆమె వెల్లడించారు.
2022లో క్రిషాంగి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. 2024లో మాంచెస్టర్ లో ఆమె ఆ సెర్మనీకి హాజరయ్యారు. డిగ్రీ, పీజీ తర్వాత, రెండేళ్ల పాటు సింగపూర్‌లో ఓ న్యాయ కంపెనీలో ఇంటర్న్‌షిప్ చేశారు. దీంతో అంతర్జాతీయ లీగల్ ప్రాక్టీస్‌లో ఆమె ఆసక్తి పెరిగింది.