న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8 : నాలుగేండ్ల క్రితం భారతీయ కుటుంబాలు తమ వద్ద ఉన్న ప్రతి 100 రూపాయల ఆర్థిక పొదుపునకు 27 రూపాయల అప్పును కలిగి ఉండేవి. నేడు ఆ అప్పు 32 రూపాయలకు చేరింది. వారు పొదుపు చేయడం మానలేదు. కాని వారి అప్పులు మాత్రం పొదుపు కంటే వేగంగా పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తన 2026 ఆగస్టు బులెటిన్లో ప్రచురించిన తాజా గృహ ఆర్థిక స్థితిగతులు నివేదిక ఈ చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నది. ఈ ఏడాది మార్చి నాటికి భారతీయ కుటుంబాల వద్ద రూ.490.3 లక్షల కోట్ల విలువైన ఆర్థిక ఆస్తులు(జీడీపీలో 41.6 శాతం) ఉన్నాయి. అదే సమయంలో వారిపై రూ.158.5 లక్షల కోట్ల(జీడీపీలో 45.8 శాతం) రుణభారం ఉంది. ఇవి కేవలం ఆర్థిక పొదుపులు మాత్రమే. ఆస్తి, బంగారం ఇందులో పరిగణనలోకి తీసుకోలేదు. చాలా కుటుంబాల విషయంలో వీటి విలువ ఇంకా ఎక్కువ ఉంటుంది.
2022 జూన్ నుంచి 2026 మార్చి వరకు ఉన్న 16 త్రైమాసికాల కాలంలో కుటుంబాల రుణాలు 78 శాతం పెరిగాయి. పొదుపు 49 శాతం పెరిగింది. ఆర్థిక వ్యవస్థ 41 శాతం వృద్ధి చెందింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటుతో పోలిస్తే రుణాల వృద్ధి రేటు దాదాపు రెట్టింపుగా ఉంది. కుటుంబాలు తమ వద్ద ఉన్న ఆస్తుల మొత్తాన్ని తగ్గించుకోలేదు. పైగా ఆ నాలుగు సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం ఆరంభంతో పోలిస్తే ముగింపు సమయానికి వారి వద్ద ఉన్న ఆస్తుల విలువ పెరిగిందని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. అయితే వాటికి తోడుగా తీసుకున్న అప్పుల విషయంలో మాత్రం మార్పు వచ్చింది. ఈ 49 శాతం ఆ మొత్తం నాలుగు సంవత్సరాల కాలానికి వర్తిస్తుంది. 2024 మార్చి నాటి గణాంకాలను పరిశీలిస్తే ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటుతో పోలిస్తే పొదుపు వృద్ధి నెమ్మదిగా ఉందని ఆర్బీఐ డేటా వెల్లడిస్తున్నది. కేవలం అప్పులు మాత్రమే వేగంగా పెరుగుతూ వచ్చాయి.
కుటుంబాలు తమ డబ్బును దాచుకునే విషయంలో మార్పు వచ్చింది. ఈ ఏడాది మార్చి నాటికి కుటుంబాల ఆర్థిక ఆస్తులలో 34.4 శాతంతో బ్యాంక్ డిపాజిట్లు ఇప్పటికీ అతిపెద్ద వాటాను కలిగి ఉన్నాయి. అయితే 2022 జూన్లో ఉన్న 36 శాతం వాటాతో పోలిస్తే ఇది తగ్గింది. మ్యూచువల్ ఫండ్స్ అత్యధిక వృద్ధిని నమోదు చేశాయి. వీటి వాటా 6.4 శాతం నుంచి 10.5 శాతానికి పెరిగింది. ప్రత్యక్ష షేర్ల పెట్టుబడులు 20.1 శాతం నుంచి 18.1 శాతానికి తగ్గాయి. కుటుంబ పొదుపులో ప్రతి 100 రూపాయల్లో సుమారు 29 రూపాయలు షేర్లు, మ్యూచువల్ ఫండ్ల రూపంలో ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం మార్కెట్ కదలికలకు అనుగుణంగా మారుతుంటుంది. నాలుగేండ్ల క్రితంలో పోలిస్తే ప్రస్తుతం కుటుంబాల ఆస్తులలో షేర్ల ధరలతోపాటు పెరిగే లేదా తగ్గే భాగం ఎక్కువగా ఉంది.