Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Dussehra Special | మహారాష్ట్రలోని ఓ గ్రామంలో మాత్రం నవరాత్రి వ్రతం చాలా భిన్నంగా ఉంటుంది. తొమ్మిది రోజులపాటు కూర్చోకుండా, నేలపై పడుకోకుండా నిలబడే వ్రతాన్ని భక్తులు ఆచరిస్తారు.
Dussehra Special | దసరా నవరాత్రులు వచ్చాయంటే చాలామంది భక్తులు ఉపవాసాలు, ప్రత్యేక పూజలు చేస్తుంటారు. కొందరు రోజంతా ఒక్కసారే భోజనం చేస్తారు. కానీ మహారాష్ట్రలోని ఓ గ్రామంలో మాత్రం నవరాత్రి వ్రతం చాలా భిన్నంగా ఉంటుంది. తొమ్మిది రోజులపాటు కూర్చోకుండా, నేలపై పడుకోకుండా నిలబడే వ్రతాన్ని భక్తులు ఆచరిస్తారు. విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా సాధారణంగా మంచంపై పడుకోరు. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఊయలపై ఛాతీ ఆనించి, ఒక పాదాన్ని నేలపై ఉంచి విశ్రాంతి తీసుకుంటారు. కాలభైరవనాథ్ ఆలయంలో కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని ‘ఉభ్యాచి నవరాత్రి’ పిలుస్తుంటారు. ఈ ఆచారం సుమారు 350 ఏళ్లుగా కొనసాగుతుంది. మరి ఇంత కఠినమైన వ్రతాన్ని ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న విశ్వాసం ఏమిటి?
ఎక్కడుందీ గ్రామం?
మహారాష్ట్రలోని సతారా జిల్లాలో వై తాలూకాలో పాండే అనే గ్రామం ఉంది. ఇక్కడి కాలభైరవనాథ ఆలయంలో నవరాత్రుల సందర్భంగా ఈ ప్రత్యేక వ్రతాన్ని నిర్వహిస్తారు. స్థానికంగా దీనిని ‘ఉభ్యాచి నవరాత్రి’ లేదా నిలబడి చేసే నవరాత్రి వ్రతంగా పిలుస్తారు. ఈ సంప్రదాయం సుమారు 350 ఏళ్లుగా కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు. నవరాత్రుల సమయంలో వ్రతం ఆచరించేవారిని ‘నవరాత్రకరీలు’ అని పిలుస్తారు. ఈ ఏడాది సుమారు 100 మంది పురుషులు ఈ వ్రతంలో పాల్గొంటున్నారు. గ్రామంలోనే కాకుండా ఉద్యోగాలు, ఇతర పనుల కోసం దూర ప్రాంతాల్లో నివసించే కొందరు కూడా ఈ సంప్రదాయంలో పాల్గొనేందుకు స్వగ్రామానికి వస్తారు.
తొమ్మిది రోజులపాటు కూర్చోవడం, నేలపై పడుకోవడం నిషేధం
ఈ వ్రతంలో అత్యంత ముఖ్యమైన నియమం కూర్చోకపోవడం. నవరాత్రులు ప్రారంభమైనప్పటి నుంచి విజయదశమి వరకు భక్తులు నిరంతరం నిలబడే విధంగా వ్రతాన్ని పాటిస్తారు. నేలపై కూర్చోవడం, పడుకోవడం నిషేధం. నడిచేటప్పుడు కూడా పరుగెత్తడం, వేగంగా కదలడం వంటి వాటికి దూరంగా ఉంటారు. నిలబడేందుకు, నడిచేందుకు చేతిలో కర్రను ఆధారంగా తీసుకుంటారు. ఆలయంలోనే ఎక్కువ సమయం గడుపుతూ పూజలు, హారతుల్లో పాల్గొంటారు. వ్రత నియమాలను పాటిస్తూ తొమ్మిది రోజులపాటు తమ మొక్కును పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటారు.

Ubhya Navratri1
నిద్ర వచ్చినప్పుడు ఏం చేస్తారు?
ఈ వ్రతంలోని మరో ప్రత్యేకత విశ్రాంతి తీసుకునే విధానం. సాధారణంగా అలసట వచ్చినప్పుడు కూర్చుంటాం లేదా పడుకుంటాం. కానీ ఈ వ్రతంలో నేలపై కూర్చోవడం, పడుకోవడం వీలుకాదు. అందుకోసం ఆలయంలో ‘చౌఫాలా’ అని పిలిచే ప్రత్యేక ఊయల తరహా ఆధారాన్ని ఏర్పాటు చేస్తారు. భక్తులు దానిపై ఛాతీని ఆనించి, ఒక పాదాన్ని నేలపై ఉంచి మరో పాదాన్ని పైకి ఎత్తి విశ్రాంతి తీసుకుంటారు. ఇలా చేయడం ద్వారా నిలబడే వ్రత నియమాన్ని కొనసాగిస్తున్నామని వారు భావిస్తారు. ఈ ఆచారం శారీరకంగా ఎంతో కఠినమైనది. ఎక్కువసేపు నిలబడటం వల్ల అలసట, కాళ్ల నొప్పులు వంటి సమస్యలు రావచ్చు. అయినప్పటికీ, భక్తులు తమ విశ్వాసం ప్రకారం వ్రతాన్ని కొనసాగిస్తారు.
ఇంత కఠినమైన వ్రతం ఎందుకు చేస్తారు?
పాండే గ్రామంలోని భక్తులు తమ కోరికలు నెరవేరాలని లేదా నెరవేరిన కోరికకు కృతజ్ఞతగా గ్రామదేవత కాలభైరవనాథుడికి మొక్కులు చెల్లిస్తారు. ఆ మొక్కులో భాగంగానే తొమ్మిది రోజులపాటు నిలబడి వ్రతం ఆచరిస్తారు. స్థానిక విశ్వాసం ప్రకారం, కాలభైరవనాథుడికి భక్తితో మొక్కుకుని ఈ వ్రతాన్ని పూర్తి చేయడం ద్వారా తమ కోరికలకు దైవానుగ్రహం లభిస్తుందని భావిస్తారు. కొందరు భక్తులు ఈ వ్రతాన్ని వరుసగా మూడు, ఐదు, ఏడు, పది లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు కొనసాగిస్తామని మొక్కుకుంటారు.
ఆహార నియమాలు కూడా కఠినమే
ఈ వ్రతంలో నిలబడటమే కాదు.. ఆహార నియమాలను పాటించడం కూడా ముఖ్యమైన భాగం. వ్రతం చేసే భక్తులు నూనె, ఉప్పు, కారం వంటి పదార్థాలను తీసుకోరు. పాలు, పండ్లు, సగ్గుబియ్యంతో తయారు చేసే ఖీర్ వంటి పరిమిత ఆహారాన్ని తీసుకుంటారు. వ్రత సమయంలో తెల్లని దుస్తులు ధరిస్తారు. పాదరక్షలు లేకుండా ఉంటారు. చేతిలో కర్రను పట్టుకుని గ్రామంలో జరిగే పూజలు, హారతుల్లో పాల్గొంటారు. విజయదశమి వరకు గ్రామ సరిహద్దులు దాటకూడదనే నియమాన్ని కూడా పాటిస్తారు.
నియమం తప్పితే మళ్లీ మొదటి నుంచి!
వ్రతాన్ని ఆచరించేవారు నిర్ణయించుకున్న నియమాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అనుకోకుండా కూర్చున్నా లేదా వ్రత నియమాన్ని ఉల్లంఘించినా, ఆలయ పూజారికి విషయం చెప్పి వ్రతాన్ని మళ్లీ ప్రారంభించాల్సి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. నియమాలను దాచిపెట్టి ఉల్లంఘిస్తే అనారోగ్యం లేదా ఇతర ఇబ్బందులు ఎదురవుతాయని కొందరు భక్తులు విశ్వసిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

