అరారియా: బీజేపీ-జేడీయూ కూటమి పాలనలోని బీహార్లో మరో వంతెన ప్రారంభానికి ముందే కుప్ప కూలింది. అరారియా జిల్లాలోని పరారియా గ్రామంలో ఈ ఘటన జరిగింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
రూ.12 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఈ వంతెనలో అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని ఇంకా చేపట్టలేదు. దీంతో ఈ వంతెనపై ప్రజా రవాణాకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. బక్రా నదిపై కుర్సా కంటా, స్కిటీ ప్రాంతాలను కలుపుతూ ఈ బ్రిడ్జిని నిర్మించారు. బ్రిడ్జి కూలడానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారని అరారియా ఎస్పీ అమిత్ రంజన్ తెలిపారు. ఈ సంవత్సరం మార్చి నెలలో కోసి నదిపై నిర్మిస్తున్న వంతెన కూలి పది మంది గాయపడ్డారు.