ఇమ్రాన్ ఖాన్‌కు ఒక్కో మిత్ర పక్షం ఝలక్ ఇస్తోంది. ఇన్ని రోజుల పాటు బలంగా మద్దతిస్తూ వచ్చిన మిత్రపక్షాలు ఇప్పుడు రాం రాం చెప్పేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో వారం రోజుల్లోనైనా ఇమ్రాన్ ప్రధాని పదవికి రాజీనామా చేసేస్తారని ప్రతిపక్షాలు బలంగా విశ్వసిస్తున్నాయి. ఇది ఇలా వుండగా… పాకిస్తాన్ ముస్లిం లీగ్ (క్యూ), పీఎంఎల్ నవాజ్ అనే రెండు పక్షాలు మాత్రం తదుపరి ప్రధాన మంత్రి ఎవరన్న రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసేశాయి. ఈ రెండు పార్టీల మధ్య ఓ డీల్ కూడా కుదిరింది. అయితే.. మిగతా పక్షాలు దీనికి మద్దతిస్తాయా? అన్నది మాత్రం ఇంకా తేలాల్సి వుంటుంది.
మరో వారం రోజుల్లో ఇమ్రాన్ కుర్చీ దిగేస్తారని ఈ రెండు పక్షాలు బలంగా ప్రచారం చేస్తున్నాయి. దీని తర్వాత కొత్త ప్రభుత్వం ఎలా వస్తుందని ఆ పక్షాలు అంచనా వేస్తున్నాయి. అయితే.. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మాత్రం.. కొత్త ప్రధానిగా మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు షాహబాజ్ షరీఫ్‌ను ప్రధానిగా ముందుకు తేవాలని ఈ రెండు పక్షాలు సిద్ధమయ్యాయి. ఇక రాష్ట్రపతిగా ప్రధాని ఇమ్రాన్‌కు బద్ధ విరోధి అయిన మౌలానా ఫజలుర్మహాన్ అనే నేతను ఎన్నుకోనున్నారు. ఈ దిశగానే ముస్లిం లీగ్ (క్యూ), పీఎంఎల్ నవాజ్ అనే రెండు పక్షాలు వ్యూహ రచన చేస్తున్నాయి. ఇక చైర్మన్ పదవిని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేత యూసుఫ్ రజా గిలీనాకి ఇవ్వాలని ఓ అంచనాకు వచ్చారు.