డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లోని గుప్తకాశిలో రోడ్డు మధ్యలో ఓ ప్రైవేటు హెలికాప్టర్ అత్యవసరంగా దిగింది. శనివారం మధ్యాహ్నం 12.52 గంటలకు జరిగిన ఈ సంఘటనలో హెలికాప్టర్ తోక కింద ఓ కారు నలిగిపోయింది. ఈ ఘటనలో పైలట్ కెప్టెన్ ఆర్పీఎస్ సోధిని దవాఖానకు తరలించారు. జిల్లా పర్యాటకాభివృద్ధి శాఖ అధికారి రాహుల్ చౌబే మాట్లాడుతూ.. బడసు బేస్ నుంచి బయల్దేరిన వెంటనే ఈ హెలికాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడినట్లు పైలట్ గుర్తించి, వెంటనే రోడ్డుపై దించేశారని చెప్పారు. కేదార్నాథ్ ధామ్‌కు వెళ్తుండగా ఈ సంఘటన జరిగిందన్నారు. పైలట్ అప్రమత్తత వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు చెప్పారు. నెల రోజుల వ్యవధిలో హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ జరగడం ఇది నాలుగోసారి.