న్యూఢిల్లీ: సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న కోవీషీల్డ్ టీకాల వ్యవధి అంశంలో వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వివరణ ఇచ్చారు. కోవీషీల్డ్ రెండు డోసుల టీకాల మధ్య వ్యవధిని పెంచడాన్ని ఆయన సమర్థించుకున్నారు. ఇది పారదర్శకంగా తీసుకున్న నిర్ణయమని, శాస్త్రీయ డేటా ఆధారంగా ఆ నిర్ణయం తీసుకోవడం జరిగినట్లు ఆయన తన ట్వీట్లో తెలిపారు. ప్రస్తుతం కోవీషీల్డ్ టీకాలను 12 నుంచి 16 వారాల తేడాలో ఇస్తున్న విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్ డేటాను అంచనా వేసే సామర్థ్యం ప్రభుత్వం వద్ద ఉందని, ఒక ముఖ్యమైన విషయాన్ని రాజకీయం చేయడం దురదృష్టకరమని మంత్రి హర్షవర్ధన్ అన్నారు. రెండు డోసుల కోవీషీల్డ్ టీకాల మధ్య వ్యవధిని పెంచడాన్ని ఎన్టీఏజీఐ(నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్) చీఫ్ డాక్టర్ ఎన్కే అరోరా సమర్థించారు. డాక్టర్ అరోరా ఇచ్చిన వివరణను మంత్రి తన ట్వీట్లో ట్యాగ్ చేశారు.
బ్రిటన్ ఆరోగ్యశాఖ వెల్లడించిన డేటా ఆధారంగా కోవీషీల్డ్ టీకాలపై నిర్ణయం తీసుకున్నట్లు డాక్టర్ అరోరా తెలిపారు. రెండు డోసుల మధ్య వ్యవధిని 12 వారాలకు పెంచితే, అప్పుడు వ్యాక్సిన్ సామర్థ్యం 65 శాతం నుంచి 88 శాతానికి పెరిగినట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఆల్ఫా వేరియంట్ ఉదృతంగా ఉన్న సమయంలో బ్రిటన్ చేపట్టిన సర్వే వివరాలను ఆయన వెల్లడించారు. ఆ సమయంలో టీకాల మధ్య వ్యవధిని 12 వారాల ఉంచడం వల్ల ఆల్ఫా వేరియంట్‌ను సులువుగా ఎదుర్కొన్నట్లు బ్రిటన్ తన స్టడీలో తెలిపిందన్నారు. ఆ ఐడియా బాగుందని, వ్యవధిని పెంచడం వల్ల అడినోవెక్టర్ వ్యాక్సిన్ల ప్రతిస్పందన పెరుగుతందని గ్రహించినట్లు ఆయన తెలిపారు. రెండు డోసుల మధ్య గ్యాప్‌ను పెంచే అంశంలో కోవిడ్ వర్కింగ్ గ్రూపులో ఎటువంటి విభేదాలు తలెత్తలేదని అరోరా చెప్పారు.
Decision to increase the gap between administering 2 doses of #COVISHIELD has been taken in a transparent manner based on scientific data.
— Dr Harsh Vardhan (@drharshvardhan) June 16, 2021
India has a robust mechanism to evaluate data.
It's unfortunate that such an important issue is being politicised!https://t.co/YFYMLHi21L
ఆస్ట్రాజెనికా కంపెనీ బ్రిటన్‌లో కోవీషీల్డ్ టీకాలను మరో పేరుతో పంపిణీ చేస్తున్నది. తొలుత ఇంగ్లండ్‌లో ఆస్ట్రాజెనికా టీకాను ప్రవేశపెట్టినప్పుడు ఆ గ్యాప్ 12 వారాలు అని, కానీ తాము మాత్రం నాలుగు వారాల వ్యవధి సరిపోతుందని భావించినట్లు అరోరా తెలిపారు. కానీ తర్వాత జరిగిన అధ్యయనాల ఆధారంగా.. కోవీషీల్డ్ టీకాను 4 వారాల వ్యవధిలో ఇస్తే, దాని సామర్థ్యం 57 శాతం ఉందని, ఇక 8 వారాల వ్యవధిలో ఇస్తే దాని సామర్థ్యం 60 శాతం ఉన్నట్లు తేలిందన్నారు. కెనడా, శ్రీలంక దేశాలు కూడా 12 నుంచి 16 వారాల గ్యాప్‌ను అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇటీవల పంజాబ్ రాష్ట్రంలో ఆల్ఫా వేరియంట్ వ్యాపించిన విషయం తెలిసిందే. అయితే అక్కడ నిర్వహించిన సర్వేలో.. కోవీషీల్డ్ ఒక డోసు తీసుకున్నా లేక రెండు డోసులు తీసుకున్నా.. దాని సామర్థ్యం 75 శాతం ఉన్నట్లు తేలిందన్నారు. అంటే ఒక డోసు తీసుకున్నా ఎక్కువ శాతం రక్షణ ఉన్నట్లే అని గుర్తించామన్నారు. ఇక సీఎంసీ వెల్లోర్ గ్రూపు నిర్వహించిన సర్వేలో.. తొలి డోసు కోవీషీల్డ్‌తో 61 శాతం రక్షణ, రెండు డోసులు తీసుకుంటే అది 65 శాతం ఉన్నట్లు గుర్తించారన్నారు. ఒక డోసు తీసుకున్నవారిలో 4 శాతం ఇన్ఫెక్షన్, రెండో డోసులు తీసుకున్నవారిలో 5 శాతం ఇన్ఫెక్షన్ ఉన్నట్లు ఆ రెండు సర్వేలు వెల్లడించినట్లు తెలిపారు.
ఒకవేళ వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధిని తగ్గిస్తే ఫలితం జరుగుతుందని తేలినా.. లేక కనీసం 5 నుంచి 10 శాతం ప్రయోజనం ఉన్నా.. అప్పుడు వ్యవధిని తగ్గించే నిర్ణయం తీసుకుంటామని డాక్టర్ అరోరా తెలిపారు.