న్యూఢిల్లీ, డిసెంబర్ 10: వీసా వెట్టింగ్ కోసం హెచ్1బీ- ఉద్యోగులు/దరఖాస్తుదారులు, వారిపై ఆధారపడిన వారు తమ సోషల్ మీడియా అకౌంట్లను బహిర్గతం చేయాలని ఆదేశిస్తూ అమెరికా విదేశాంగ శాఖ జారీచేసిన కొత్త నిబంధన తమ వీసాలను రెన్యువల్ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్న వారితోపాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలోనూ గుబులు రేపుతున్నది. డిసెంబర్ 15 నుంచి కొత్త నిబంధన అమలులోకి రానున్నది. అమెరికాలో హెచ్-1బీ వీసాలు పొందిన విదేశీయుల్లో 70 శాతానికి పైగా భారతీయులే ఉన్నారు. ఇక హెచ్-4 ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్(ఈఏడీ) హోల్డర్లలో దాదాపు 90 శాతం మంది కూడా భారతీయులే ఉన్నారు.
ఇన్స్టాగ్రామ్, ఎక్స్, లింక్డ్ఇన్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై వీసా దరఖాస్తుదారుల పోస్టులను కాన్సులర్ అధికారులు పకిశీలించేందుకు కొత్త నిబంధన అనుమతిస్తుంది. వివాదాస్పద పోస్టులు, కామెంట్లు, రాజకీయ వ్యాఖ్యలపై కాన్సులర్ అధికారుల నిశిత పరిశీలన జరుగుతుంది. వీటి కారణంగా వీసాల ఆమోదం ఆగిపోయే అవకాశం కూడా ఉంది. తమ సోషల్ ప్రొఫైల్స్‌ని సమీక్షించుకోవాలని, రాజకీయ మీమ్స్‌ని షేర్ చేయరాదని, వీసా దరఖాస్తుల్లో తమ ప్రొఫెషనల్ ఈమెయిల్స్ని ఉపయోగించాలని భారతీయ ఉద్యోగులు అధికంగా ఉన్న కంపెనీలు తమ ఉద్యోగులకు సూచిస్తున్నాయి.
అపాయింట్మెంట్లు అర్ధాంతరంగా రద్దు
హైదరాబాద్, చెన్నైతోసహా దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ కాన్సులేట్లలో వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లు అర్ధాంతరంగా రద్దయినట్లు తెలుస్తున్నది. తమ డిసెంబర్ స్లాట్లు 2026 మార్చికి వాయిదాపడినట్లు పలువురు దరఖాస్తుదారులకు సమాచారం అందింది. రీషెడ్యూల్ గురించి ఇప్పటికే నోటిఫికేషన్ అందుకున్నట్లయితే వీసా దరఖాస్తుదారులు తమ పాత ఇంటర్వ్యూ తేదీల్లో రావద్దని భారత్‌లోని అమెరికన్ ఎంబసీ మంగళవారం హెచ్చరించింది. ఎవరైనా వస్తే వారిని గేటు బయట నుంచే పంపించివేస్తామని తెలిపింది. కొత్త అపాయింట్మెంట్ తేదీనాడు మీరు ఇంటర్వ్యూకు రావలసి ఉంటుందని ఎక్స్ పోస్టులో ఎంబసీ స్పష్టంచేసింది.