చండీగఢ్: పంజాబ్‌లోని కపుర్తలాలో ఒక యువకుడ్ని కొట్టి చంపిన కేసులో గురుద్వారా నిర్వాహకుడ్ని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడు అమర్జీత్ సింగ్‌పై హత్య, హత్యాయత్నంతోపాటు ఇతర నేర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నెల 19న నిజాంపూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి స్థానిక గురుద్వారాపై ఉన్న సిక్కుల పవిత్ర మత జెండా అయిన నిషాన్ సాహిబ్‌ను తొలగించేందుకు ప్రయత్నించినట్లు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో గురుద్వారాకు చెందిన కొందరు ఆ యువకుడ్ని కొట్టి, కత్తులతో పొడిచి చంపారు. మృతుడి శరీరంపై సుమారు 30 కత్తి గాయాలున్నాయని, అతడి తల, మెడ, ఛాతి, ఇతర భాగాల్లో బలమైన కత్తి పోట్లు ఉన్నాయని పోస్ట్‌మార్టం రిపోర్టులో పేర్కొన్నారు. ఈ ఘటనతోపాటు ముందు రోజు అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్లో జరిగిన ఇలాంటి మరో ఘటన పంజాబ్‌లో కలకలం రేపింది.
కాగా, మృతుడు ఎలాంటి అపవిత్ర పనికి పాల్పడలేదని కపుర్తలా పోలీసులు నిర్ధారించారు. ఆ యువకుడు దొంగతనం కోసం రాగా కొట్టి హత్య చేశారని ఆరోపించారు. పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ కూడా శుక్రవారం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అక్కడ ఎలాంటి మతపరమైన అపవిత్ర చర్య జరుగలేదన్నారు. ఈ మేరకు కేసును సవరిస్తామని, నిందితులను అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో గురుద్వారా సంరక్షకుడు అమర్జీత్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.