Supreme Court : సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను మరోసారి పెంచేందుకు కేంద్రం సిద్ధమైంది. దీనికోసం రూపొందించిన బిల్లును కేంద్రం లోక్సభలో సోమవారం ప్రవేశపెట్టింది. సుప్రీంకోర్టు (నంబర్ ఆఫ్ జడ్జెస్) అమెండ్మెంట్ బిల్, 2026ను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్పాల్ సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. దీనిప్రకారం ఇప్పటికే ఉన్న సుప్రీంకోర్టు (నంబర్ ఆఫ్ జడ్జెస్) యాక్ట్, 1956ను మార్చనున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టడం విశేషం. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 33 మంది జడ్జీలున్నారు.
ఈ బిల్లు ఆమోదం పొందితే సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 37కు పెరుగుతుంది. ప్రస్తుతం పార్లమెంట్లో నీట్ యూజీ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపక్షాల ఆందోళన మధ్యే ప్రభుత్వం ఈ బిల్లును కేంద్రం సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు కొత్తదేం కాదు. దీనిపై కేంద్రం గతంలోనే ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనికి రాష్ట్రపతి కూడా ఇంతకుముందే ఆమోదం తెలిపారు. ఈ ఆర్డినెన్స్ ప్రకారం సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను 37కు పెంచుకోవచ్చు. అయితే, దీన్ని పూర్తిస్థాయి చట్టంగా తీసుకురావాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. అందుకోసమే బిల్లును రూపొందించి, ప్రవేశపెట్టింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 ప్రకారం సుప్రీకోర్టు జడ్జీల సంఖ్యను చట్టం ద్వారా పార్లమెంటే నిర్ణయించవచ్చు. దీనికోసం సాధారణ మెజారిటీ ఉంటే చాలు. ఇతర రాజ్యాంగ సవరణ చట్టాలలాగా మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం లేదు. దీంతో ఈ బిల్లు త్వరగానే ఆమోదం పొందే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఇప్పుడు సుప్రీంకోర్టుకు 37 మంది జడ్జీలు ఉంటారు. అదనంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా. సీజేఐతో కలిపితే మొత్తం 38 మంది జడ్జీలు అవుతారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 32 మంది జడ్జీలు పని చేస్తున్నారు. ఎన్డీయే ప్రభుత్వం గతంలో 2019లోనే జడ్జీల సంఖ్యను ఒకసారి పెంచింది.
ఇప్పుడు మరోసారి పెంచేందుకు సిద్ధమైంది. భారత సుప్రీంకోర్టు జడ్జీలకు సంబంధించి గతంలో ఉన్న సంఖ్య ఇది. 1956లో సుప్రీంకోర్టులో సీజేఐతో కలిపి 10 మంది జడ్జీలు ఉండేవారు. ఆ తర్వాత దీన్ని 1960లో 13కు పెంచింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాత 1977లో 17కు, 1986లో 25కు, 2008లో 30కి, 2019లో 33కు పెంచారు.