ముంబై: అక్క పట్ల ఎక్కువగా ఇష్టం చూపుతున్న తల్లిపై చిన్న కుమార్తె ద్వేషం పెంచుకున్నది. తనను చూసేందుకు ఇంటికి వచ్చిన ఆమెతో ఘర్షణ పడింది. ఈ నేపథ్యంలో కత్తితో పొడిచి తల్లిని హత్య చేసింది. (Daughter Stabs Mother) అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. 63 ఏళ్ల సబీరా బానో తన కుమారుడితో కలిసి ముంబ్రాలో నివసిస్తున్నది. 41 ఏళ్ల చిన్న కుమార్తె రేష్మా ముజఫర్‌ను చూసేందుకు గురువారం రాత్రి కుర్లాలోని ఖురేషీ నగర్‌లోని ఆమె ఇంటికి వెళ్లింది.
కాగా, తల్లి సబీరా అక్క పట్ల ఎక్కువ ప్రేమ చూపడంపై చిన్న కుమార్తె రేష్మా ద్వేషం పెంచుకున్నది. ఈ నేపథ్యంలో తనను చూసేందుకు ఇంటికి వచ్చిన ఆమెతో ఈ విషయంపై వాగ్వాదానికి దిగింది. ఇది కాస్తా వారి మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ నేపథ్యంలో వంట గదిలోని కత్తితో వృద్ధురాలైన తల్లి సబీరాను కుమార్తె పొడిచింది. ఆమె మరణించడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రేష్మా మానసిక పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.