న్యూఢిల్లీ: గృహ రుణం తీసుకోవడమంటే పొదుపు చేయడం కాదని భాష్యం చెప్పిన కేంద్ర ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం మండిపడ్డారు. ఆ సిద్ధాంతంపై పునఃపరిశీలన జరపాలని ఆదివారం సోమనాథన్కు సూచించారు.
ఆదాయ పన్ను రాయితీలను పొందాలనుకునేవారిలో సగం మంది గృహ రుణాలు లేదా గృహ రుణ వడ్డీల్లాంటి ‘పొదుపు రహిత’ పథకాలవైపు మొగ్గు చూపుతున్నారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సోమనాథన్ చెప్పడంతో చిదంబరం ఈ సూచన చేశారు. గృహ రుణ కిస్తీలను, వడ్డీని చెల్లించడం వ్యయమే అయినా అంతిమంగా అది ఓ ఆస్తిగా మారుతుందని, కనుక అది పొదుపేనని చిదంబరం స్పష్టం చేశారు.