ముంబై: ఒక మహిళ తన తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ పెళ్లి చేసుకున్నది. బంధువుల ఇంట్లో జరిగే పెళ్లి వేడుక కోసం భర్తతో కలిసి వెళ్లింది. ఈ సంగతి తెలుసుకున్న మహిళ తండ్రి అక్కడకు వచ్చాడు. రివాల్వర్‌తో కాల్పులు జరిపి కుమార్తెను హత్య చేశాడు. (Father Shoots Daughter) మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 24 ఏళ్ల తృప్తి, 28 ఏళ్ల అవినాష్ వాగ్ రెండేళ్ల కిందట లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. తృప్తి తండ్రైన రిటైర్డ్ సీఆర్పీఎఫ్ ఎస్ఐ కిరణ్ మాంగ్లే వారి ప్రేమ పెళ్లిని వ్యతిరేకించాడు.
కాగా, శనివారం రాత్రి చోప్డాలో అవినాష్ సోదరి హల్దీ కార్యక్రమం జరిగింది. తృప్తి, అవినాష్ ఈ వేడుకకు హాజరయ్యారు. తృప్తి తండ్రి కిరణ్‌కు ఈ విషయం తెలిసింది. దీంతో పెళ్లి జరిగే ఆ ప్రాంతానికి అతడు చేరుకున్నాడు. తన సర్వీస్ రివాల్వర్‌తో కుమార్తె తృప్తిపై కాల్పులు జరుపడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. భార్యను కాపాడే ప్రయత్నంతో అవినాష్ కూడా కాల్పుల్లో గాయపడ్డాడు.
మరోవైపు పెళ్లి వేడుకలో పాల్గొన్న అతిథులు ఇది చూసి ఆగ్రహానికి గురయ్యారు. కాల్పులు జరిపిన కిరణ్‌ను పట్టుకుని కొట్టారు. దీంతో అతడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. కాల్పుల సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తృప్తి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాల్పుల్లో గాయపడిన అవినాష్‌తోపాటు పెళ్లి అతిథులు కొట్టడంతో గాయపడిన కిరణ్‌ను జల్గావ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.