గుజరాత్ రాష్ట్రం భూతల స్వర్గమే అన్న చందంగా బీజేపీ నేతలు చెబుతుంటారు. ఇప్పుడు గుజరాత్ ప్రజలకు, పారిశ్రామిక వేత్తలకు పెద్ద ఇబ్బంది వచ్చిపడింది. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ విద్యుత్ సంక్షోభంలో చిక్కుకుంది. ఏకంగా వారానికో రోజు పరిశ్రమలకు అక్కడి ప్రభుత్వం పవర్ హాలిడే ప్రకటించేసింది. అంటే పరిస్థితి ఎలా తయారైందో అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్రంలోని కరెంట్ కోతలను నిరసిస్తూ వందలాది మంది గుజరాత్ రైతులు రోడ్డెక్కుతున్నారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మండలాలు, జిల్లాలు, తాలూకాల స్థాయిలో తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తమకు అవసరమైన మేర విద్యుత్‌ను సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 75 ప్రాంతాల్లో రైతులు నిరసన వ్యక్తం చేశారు. తమ పంటలు పండించుకోవడానికి అవసరమైనంత విద్యుత్‌ను సరఫరా చేయాలని అధికారులను నిలదీస్తున్నారు. గత రెండు వారాలుగా రైతులు రోడ్లపై నిరసన వ్యక్తం చేస్తూనే వున్నారు.
ఇక విపక్ష నేతలు కూడా బీజేపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. అసెంబ్లీ వేదికగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏకి పారేస్తున్నారు. విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు ఏకంగా అసెంబ్లీ గేటు ముందే నిరసనకు దిగారు. రైతులకు 6 గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తోందని, కనీసం 3 గంటలైనా విద్యుత్ సరఫరా చేయడం లేదని మండిపడుతున్నారు.
నా నియోజకవర్గంలో కొబ్బరి రైతులు నానా తంటాలు పడుతున్నారు. కన్నీళ్లు కారుస్తున్నారు. తమ తమ కొబ్బరి పంటకు మోటార్ పంపుల ద్వారా నీళ్లిచ్చుకోలేని దుస్థితిలో వున్నారు. దాదాపు 7 నుంచి 8 గంటల విద్యుత్ సరఫరా వారికి అవసరం ఉంది. అని కాంగ్రెస్ ఎమ్మెల్యే సోమనాథ్ పేర్కొన్నారు. ఇక మరో ఎమ్మెల్యే చూడాసమా మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరా విషయంలో నాకు ప్రతి రోజూ 100 కాల్స్ వస్తున్నాయి. ఈ విషయంలో సహాయం చేయమని అడుగుతున్నారు. ఇది పెద్ద సంక్షోభమే. రైతులు కంటి నిండా నిద్ర కూడా పోవడం లేదు. ఎందుకంటే అర్ధరాత్రి కరెంట్‌ను సరఫరా చేస్తున్నారు అంటూ చూడాసమా మండిపడుతున్నారు .