న్యూఢిల్లీ : పంజాబ్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రైతు నాయకుడు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో రైతు నాయకుడు గుర్నామ్ సింగ్ సంయుక్త సంఘర్ష్ పార్టీని ప్రారంభించారు. ఈ సందర్భంగా గుర్నామ్ సింగ్ మాట్లాడుతూ.. చాలా పార్టీలు జనాలను డబ్బులతో కొనేశాయన్నారు. దేశంలో పెట్టుబడిదారీ విధానం క్రమంగా పెరిగిపోతోందన్నారు. ఈ దేశంలో పేదలు, ధనికుల మధ్య చాలా గ్యాప్ ఉందన్నారు. తమ పార్టీ కులమతాలకు అతీతంగా ఉంటుందన్నారు. అన్ని మతాలు, అన్ని కులాలు, గ్రామీణ, పట్టణ, కార్మికులు, రైతులకు మద్దతుగా తమ పార్టీ కార్యకలాపాలు ఉంటాయని గుర్నామ్ సింగ్ స్పష్టం చేశారు. పంజాబ్ ఎన్నికల్లో తమ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పారు.