న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: తమ కుమారుడి మరణానికి సంబంధించిన దర్యాప్తు నివేదికలను దాచిపెడుతున్నారని ఆరోపిస్తూ ఓపెన్ ఏఐ విజిల్‌బ్లోయర్ సుచిర్ బాలాజీ తల్లిదండ్రులు పూర్ణిమ రామారావు, బాలాజీ రామమూర్తి శాన్ ఫ్రాన్సిస్కో పోలీసు శాఖ(ఎస్ఎఫ్పీడీ)పై అక్కడి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దర్యాప్తు నివేదికలను తమకు అందుబాటులో ఉంచాలని, కేసును మూసివేశామంటూ డిసెంబర్లో ఎస్ఎఫ్పీడీ అధికారులు తమకు ఇచ్చిన సమాచారంపై విచారణ జరగాలని శుక్రవారం దాఖలు చేసిన పిటిషన్లో వారు కోరారు. దర్యాప్తు నివేదిక ప్రతిని తమకు ఇవ్వాలన్న తమ అభ్యర్థనను ఎస్ఎఫ్పీడీ తోసిపుచ్చిన విషయాన్ని పిటిషన్లో పేర్కొన్నారు.