లక్నో: మాజీ ఆర్మీ జవాన్‌ను అతడి భార్య, ఆమె ప్రియుడు మరో ఇద్దరితో కలిసి నరికి చంపారు. మృతదేహాన్ని ఆరు ముక్కలుగా నరికారు. (Ex-Army Man Hacked To Death) ఆ భాగాలను పలు చోట్ల పడేశారు. మృతదేహం భాగాలను గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరకు నిందితులను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బహదూర్‌పూర్ ప్రాంతంలో నివసించే 62 ఏళ్ల మాజీ సైనికుడు దేవేంద్ర కుమార్‌ను భార్య, ఆమె ప్రియుడు మరో ఇద్దరు వ్యక్తులతో కలసి ఇంట్లో హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని ఆరు ముక్కలుగా నరికారు. వాటిని పాలిథిన్ కవర్లలో చుట్టి పలు చోట్ల పడేశారు. మే 10న తన భర్త కనిపించడం లేదని 44 ఏళ్ల మాయా దేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కాగా, అదే రోజు ఉదయం ఖరీద్ గ్రామం సమీపంలోని పొలంలో పడేసిన తెగిన చేతులు, కాళ్లను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. మృతుడ్ని మాజీ సైనికుడు దేవేంద్ర కుమార్‌గా గుర్తించారు. తొలుత పోలీసులను తప్పుదారి పట్టించేందుకు భార్య మాయా దేవి ప్రయత్నించింది. అయితే తండ్రి దేవేంద్ర కుమార్‌ను తల్లే చంపిందని కుమార్తె అంబ్లి పోలీసులకు చెప్పింది.
మరోవైపు మాయా దేవిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. లారీ డ్రైవర్ అయిన ప్రియుడు అనిల్ యాదవ్, మరో ఇద్దరు వ్యక్తులైన మిథిలేష్ పటేల్, సతీష్ యాదవ్ సహాయంతో భర్తను హత్య చేసినట్లు ఆమె ఒప్పుకున్నదని పోలీస్ అధికారి తెలిపారు. ఆమె చెప్పిన ఆధారాల మేరకు ఖరీద్ దరౌలి గ్రామంలోని బావిలో పడేసిన మొండెంను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మాయా దేవితోపాటు మిథిలేష్ పటేల్‌ను సోమవారం అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
కాగా, మంగళవారం పరిఖారాలో వాహనాల తనిఖీ సమయంలో అనిల్ యాదవ్, సతీష్ యాదవ్‌లను పోలీసులు గుర్తించారు. అనిల్ యాదవ్ కాల్పులు జరుపడంతో అతడి కాలుపై కాల్పులు జరిపి అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. కంట్రీ మేడ్ పిస్టల్, స్పెండ్ కార్ట్రిడ్జ్, లైవ్ రౌండ్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సతీష్ యాదవ్ నుంచి హత్యాయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అనిల్ యాదవ్‌తో వివాహేతర సంబంధం ఉన్నందున మాజీ ఆర్మీ జవాన్ అయిన తన భర్తను మాయా దేవి హత్య చేసిందని ఎస్పీ వెల్లడించారు.