న్యూఢిల్లీ, జూలై 20: దశాబ్ద కాలంగా పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలపడం, దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడంపైనే భారత్ దృష్టి సారించగా నేడు విధానకర్తలు కేవలం వాహన ఇంధన అవసరాలకు మించి ఆలోచిస్తున్నారు. వంట కోసం ఇంధనంగా ఇథనాల్‌ను విస్తృతంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా వినియోగదారులు ప్రత్యేక ఇథనాల్ ఏటీఎంల ద్వారా తమ వంట స్టవ్‌లలో వాడేందుకు వీలుగా టిన్లలో ఇథనాల్‌ను కొనుగోలు చేయగల విధానాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నది. వినియోగదారులు ప్రత్యేకంగా రూపొందించిన వంట పొయ్యిల కోసం తమ కంటెనర్లలో ఇథనాల్‌ను నింపుకోగలిగే ప్రత్యేక పంపిణీ కేంద్రాలు లేదా ఇథనాల్ ఏటీఎంల ఏర్పాటును విధాన రూపకర్తలు పరిశీలిస్తున్నారు. ఇటువంటి వ్యవస్థ ఇథనాల్ కోసం పూర్తిగా కొత్త రిటైల్ వ్యవస్థను సృష్టిస్తుంది. గృహ అవసరాలకు వంట ఇంధనం విషయంలో భారత్ ఇప్పటికీ ఎల్పీజీ పైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. దేశీయ ఉత్పత్తి పెరిగినప్పటికీ డిమాండ్‌లో దిగుమతుల వాటా గణనీయంగానే కొనసాగుతున్నది.