భువనేశ్వర్: రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అధికారిని పాకిస్థాన్‌కు చెందిన ఒక మహిళ హనీట్రాప్ (Honey Trap) చేసింది. ఈ నేపథ్యంలో దేశ క్షిపణి, ఆయుధ వ్యవస్థల సమాచారాన్ని ఆ పాక్ స్పైకి అతడు అందజేశాడు. ఈ విషయం బయటపడటంతో డీఆర్డీవో అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాలోని చాందీపూర్‌లో ఈ సంఘటన జరిగింది. 57 ఏళ్ల సీనియర్ ఉద్యోగి, బాలాసోర్ ప్రాంతంలోని చాందీపూర్‌లో ఉన్న డీఆర్డీవో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్)లో విధులు నిర్వహిస్తున్నాడు. పాకిస్థాన్‌కు గూఢచారిగా వ్యవహరిస్తున్న ఒక మహిళ అతడ్ని సంప్రదించి హనీట్రాప్ చేసింది. లైంగిక చర్యలు, డబ్బుల ద్వారా ఆ అధికారిని ఆకట్టుకున్నది. దీంతో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్)లో నిర్వహించే క్షిపణి పరీక్షలు, ఆయుధ వ్యవస్థలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్థాన్ మహిళకు ఆ అధికారి అందజేశాడు.
కాగా, అంతర్గత నిఘా దర్యాప్తు ద్వారా ఈ విషయం బయటపడింది. దీంతో చాందీపూర్ పోలీసులు ఆ డీఆర్డీవో సీనియర్ అధికారిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు బాలాసోర్ ఎస్పీ సాగరిక నాథ్ తెలిపారు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లోని వాట్సాప్‌లో లైంగిక, అసభ్యకరమైన సందేశాలు, చిత్రాలు, వీడియోలు ఉన్నట్లు చెప్పారు. అధికారిక రహస్యాల చట్టం, ఐపీసీలోని పల సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.