చండీగఢ్: పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్, పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవ్‌జ్యోతి సింగ్ సిద్ధూ మధ్య విభేదాలు ఆదివారం మరోమారు బయట పడ్డాయి. సున్నితమైన జాతీయ అంశాలపై వ్యాఖ్యలు చేయొద్దని నవ్‌జ్యోతి సింగ్ సిద్దూ సలహాదారులను అమరిందర్ సింగ్ హెచ్చరించారు. భారత్ ప్రయోజనాలకు ఎక్కువ నష్టం కలుగకుండా సిద్దూ తన సలహాదారులను నియంత్రించాలని సూచించారు. జమ్ముకశ్మీర్‌పై సిద్దూ సలహాదారుల వ్యాఖ్యలను అమరిందర్ సింగ్ తప్పు బట్టడం నాలుగు రోజుల్లో రెండోసారి.
“పంజాబ్ పీసీసీ అధ్యక్షుడికి సలహాలు ఇవ్వడానికి మాత్రమే పరిమితం కండి.. మీకు పరిజ్ఞానం లేని సున్నితమైన జాతీయ అంశాలపై స్పందించొద్దు” అని అమరిందర్ సింగ్ చెప్పారు. ఇటీవలే నవ్‌జ్యోతి సింగ్ సిద్దూ తన సలహాదారులుగా ప్యారేలాల్ గార్గ్, మాల్విందర్ మాలిలను నియమించుకున్నారు.
కశ్మీర్ ప్రత్యేక దేశం.. భారత్, పాకిస్థాన్‌లు దాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నాయని గత వారం సిద్దూ సలహాదారు మాల్విందర్ మాలీ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌పై అమరిందర్ సింగ్ విమర్శలను ప్యారేలాల్ గార్గ్ ప్రశ్నించినట్లు వార్తలొచ్చాయి. జమ్ముకశ్మీర్, పాకిస్థాన్‌లపై భారత్, కాంగ్రెస్ వైఖరికి విరుద్ధంగా, పూర్తిగా తప్పుగా మాలీ, గార్గ్ వ్యాఖ్యలు ఉన్నాయని అమరిందర్ సింగ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తనను దిగ్బ్రాంతికి గురి చేశాయన్నారు.