Tamil Song : తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) విజయ్ (Vijay) ప్రమాణస్వీకారం సందర్భంగా ఆలపించిన గీతాల క్రమం సక్రమంగా లేదని డీఎంకే (DMK) మండిపడింది. ముందుగానే ఆలపించాల్సిన రాష్ట్ర గీతాన్ని మూడో స్థానంలో ఆలపించడాన్ని ఆ పార్టీ తప్పుపట్టింది. దాంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే విజయ్ ఓ పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ప్రమాణ స్వీకార వేడుకలో గీతాల ఆలాపన క్రమాన్ని మార్చి తమిళ గీతాన్ని అవమానించారని డీఎంకేతోపాటు వామపక్షాలు (Left Parties), వీసీకే (VCK) కూడా విమర్శిస్తున్నాయి.
ప్రమాణ స్వీకార కార్యక్రమం ‘వందేమాతరం’ గేయంతో ప్రారంభమైంది. ఆ తర్వాత జాతీయ గీతం ‘జనగణమన’, చివరగా తమిళనాడు రాష్ట్ర గీతమైన ‘తమిళ తాయ్ వాళ్తు’ను ఆలపించారు. సాధారణంగా తమిళనాడు ప్రభుత్వ కార్యక్రమాల్లో ‘తమిళ తాయ్ వాళ్తు’ ను మొదట, జాతీయ గీతాన్ని చివరగా పాడటం సంప్రదాయం. కానీ ఈ సంప్రదాయానికి భిన్నంగా రాష్ట్ర గీతాన్ని మూడో స్థానానికి నెట్టడంపై ప్రతిపక్ష డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ ఘటనను డీఎంకే తీవ్రంగా పరిగణించింది.
ఇది తమిళ సంస్కృతిని, సంప్రదాయాలను అవమానించడమేనని డీఎంకే ఆరోపించింది. సీఎం విజయ్, ఆయన పార్టీ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారనడానికి ఇదే నిదర్శనమని డీఎంకే నేతలు విమర్శించారు. ముఖ్యమంత్రిగా తొలి అడుగులోనే విజయ్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ఈ వివాదంపై విజయ్ పార్టీ టీవీకే స్పందించింది. ప్రమాణ స్వీకార కార్యక్రమం రాజ్భవన్లో జరిగిందని, అక్కడి కార్యక్రమమం అంతా గవర్నర్ కార్యాలయం నిర్ణయం మేరకే జరిగిందని వివరణ ఇచ్చింది.
వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గత జనవరిలో జారీ చేసిన ఆదేశాల ప్రకారమే గీతాల ఆలాపనలో ఈ క్రమాన్ని పాటించినట్లు టీవీకే పేర్కొన్నది. అయినప్పటికీ డీఎంకే వివరణతో టీవీకే సంతృప్తి చెందలేదు. కేవలం డీఎంకేనే కాకుండా విజయ్ మిత్రపక్షాలైన సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే కూడా ఈ ఘటనపై వివరణ కోరాయి. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకూడదని సూచించాయి. ఈ పరిణామాలతో విజయ్ రాజకీయ ప్రస్థానాన్ని తొలిరోజే వివాదాలతో ప్రారంభించినట్లయ్యింది.