న్యూఢిల్లీ: ఫ్యామిలీ కోర్టులను ఆశ్రయించకుండానే సమ్మతితో ఉన్న జంటల వివాహాలను రద్దు చేయడానికి ఆర్టికల్ 142 ప్రకారం తనకు సంక్రమించిన విస్తృత అధికారాలను ఉపయోగించుకొని సుప్రీం కోర్టు మే 1న తీర్పును వెలువరించనున్నది. కుటుంబ కోర్టులను సంప్రదించకుండా దంపతుల ఇష్ట ప్రకారం వారి వివాహాలు రద్దు చేయవచ్చా? అన్న అంశంపై దాఖలైన పిటిషన్లపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. తీర్పు రిజర్వ్‌లో ఉంచినట్టు గత ఏడాది సెప్టెంబర్ 29న ప్రకటించింది. సామాజిక మార్పులు చేయడానికి కొంత సమయం పడుతుందని, తీర్పు చెప్పడం సులభమేనని, అయితే దానికి అనుకూలంగా సమాజాన్ని మార్చడం కష్టమని వ్యాఖ్యానించింది.