OTT | క్రికెట్ అభిమానులను లక్ష్యంగా చేసుకొని ఐపీఎల్ వీక్షణ ఉచితమంటూ దూసుకొచ్చిన జియో సినిమా.. ఇప్పుడు ప్రతి వారానికి కచ్చితంగా ఒక పెద్ద సినిమా, ప్రతి రోజు వెబ్ సిరీస్ ఎపిసోడ్‌ను ఉచితంగా అందిస్తామంటూ ఇతర ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లకు సవాల్ విసురుతున్నది. దీంతో పోటీని తట్టుకొనేందుకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి ఓటీటీ మాధ్యమాలు కూడా ఉచితాల బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో జియో సినిమా ‘ఉచితాల’ వ్యూహం ఓటీటీ మార్కెట్‌పై ఎటువంటి ప్రభావం చూపనున్నది? ఇతర ఫ్లాట్‌ఫామ్‌లపై ఏ విధమైన ఎఫెక్ట్ ఉంటుంది? ఓటీటీ మార్కెట్ భవిష్యత్తు ఎలా ఉండనున్నది? అనే దానిపై విస్తృతంగా చర్చ నడుస్తున్నది.
దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పనవసరం లేదు. దేశంలో కోట్లాదిగా ఉన్న క్రికెట్ అభిమానులను లక్ష్యంగా చేసుకొని ఓటీటీలోకి కొత్తగా ప్రవేశించిన జియో సినిమా.. తన వేదికపై ఐపీఎల్ ‘ఉచితంగా వీక్షించండి’ అంటూ ఆఫర్ ఇచ్చింది. దీంతో భారీ సంఖ్యలో కస్టమర్లు జియో సినిమా వైపు మళ్లారు. ఐపీఎల్ సమయంలో హాట్‌స్టార్‌పై ఐపీఎల్ చూడాలంటే రూ.365 నుంచి రూ.1499 వరకు చెల్లించాల్సి వచ్చింది. ఐపీఎల్‌తో పెరిగిన తన ఆడియన్స్ బలాన్ని కొనసాగించేందుకు జియో సినిమా మరో వ్యూహంతో ముందుకొచ్చింది. వారానికి ఉచితంగా ఒక పెద్ద సినిమా, ప్రతి రోజు వెబ్ సిరీస్ ఒక ఎపిసోడ్‌ను కచ్చితంగా అందిస్తామంటూ తాజాగా ప్రకటన చేసింది. టెలికం రంగంలో సాధించిన విజయాన్ని జియో సినిమాతో ఓటీటీ రంగంలో కూడా రిపీట్ చేయాలని యాజమాన్యం భావిస్తున్నట్టు దీని ద్వారా తెలుస్తున్నదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
పోటీని తట్టుకునేందుకు..
ఓటీటీ మార్కెట్లో పోటీని తట్టుకొనేందుకు, జియో సినిమాకు కౌంటర్ ఇచ్చేందుకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కూడా వినియోగదారులను ఆకర్షించే పనిలో పడింది. ఇందులో భాగంగా క్రికెట్ ప్రపంచ కప్, ఆసియా కప్‌ల వీక్షణను తమ వేదికపై ఉచితంగా అందిస్తామంటూ శుక్రవారం ప్రకటన చేసింది. దాదాపు 50 కోట్ల మందికి పైగా స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ రెండు టోర్నమెంట్లను తమ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పై ఉచితంగా చూడొచ్చని పేర్కొన్నది.
ఉచితాలతో ఇతర సంస్థలకు ముప్పా?
దేశంలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, ఆహా వంటి ఓటీటీ వేదికలు వినియోగదారుల నుంచి సబ్స్క్రిప్షన్ రుసుం వసూలు చేసి కంటెంట్ అందిస్తున్నాయి. అయితే కంటెంట్‌ను ఉచితంగా అందిస్తున్న జియో సినిమాతో ఇతర ఓటీటీ వేదికల మనుగడకు ముప్పు ఏర్పడుతుందా? అనే ప్రశ్న ముందుకు వస్తున్నది. ఇతర సంస్థలు ఆడియన్స్‌ను కాపాడుకొనేందుకు మార్కెట్ వ్యూహాలను మార్చుకొంటాయా? చార్జీల్లో మార్పులు చేస్తాయా? అంటే అది జరిగే అవకాశం లేదని, ఓటీటీలు అందించే ప్రత్యేకమైన కంటెంట్ ఆధారంగానే వినియోగదారులు ఫ్లాట్‌ఫాంను ఎంచుకొంటారని ఓ సంస్థకు చెందిన అధికారి చెప్పుకొచ్చారు. కొంత రుసుం వసూలు చేసి ఇంగ్లిష్ కంటెంట్‌ను అందిస్తున్న సంస్థ.. త్వరలో ప్రీమియం హిందీ కంటెంట్ విషయంలో కూడా అదే చేసే అవకాశం ఉన్నదని అభిప్రాయపడ్డారు.
ఓటీటీ మార్కెట్ భవిష్యత్తు ఏంటి?
దేశ టెలికం మార్కెట్లో ఉచిత కాల్స్, ఇంటర్నెట్ అంటూ మార్కెట్లోకి దూసుకొచ్చిన జియో.. అనంతర కాలంలో టెలికం రంగంలో పాతుకుపోయి, అతిపెద్ద సంస్థగా అవతరించింది. భారీ సంఖ్యలో వినియోగదారులను తన వైపు ఆకర్షించింది. ఆ తర్వాతనే తన మార్కెట్ వ్యూహాన్ని బయటకు తీసిన జియో సంస్థ.. టారిఫ్‌లను ప్రారంభించిందని, ఈ ప్రభావం ఇతర టెలికం సంస్థలపై తీవ్ర ప్రభావం చూపి, టెలికం సంస్థలు వసూలు చేసే టారిఫ్‌ల విషయంలో కీలకమైన మార్పులకు దారితీసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఓటీటీ విషయంలో కూడా అదే జరుగుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఓటీటీల మధ్య పెరుగుతున్న పోటీ.. టీవీ చానెళ్లను దెబ్బకొట్టే అవకాశం ఉన్నదనే విశ్లేషణలు కూడా వస్తున్నాయి.