Delhi Police : ఢిల్లీలో వరుసగా జరుగుతున్న నిరసనలు, వాటి వల్ల తలెత్తే శాంతి భద్రతల సమస్యపై ఢిల్లీ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించబోతున్నారు. ఈ నిరసనల్ని ముందుగా గుర్తించేందుకు ఇంటెలిజెన్స్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకోసం స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పని చేయనున్నారు.
ఇటీవల జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసన సందర్భంగా తలెత్తిన ఘర్షణల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిందిగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఆదేశించారు. కమిషనర్ ఆదేశాల ప్రకారం పోలీసులు ఢిల్లీలో జరగబోయే నిరసనలు, ఆందోళనలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. ఢిల్లీలోని ఇంటెలిజెన్స్ విభాగం, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కలిపి.. అక్కడ జరగబోయే ఆందోళనలకు సంబంధించిన అన్ని వివరాల్ని సేకరిస్తారు.
ఎంతమంది హాజరవుతారు.. వారు ఎక్కడి నుంచి వస్తున్నారు.. వారి కోసం నిర్వాహకులు చేస్తున్న ఏర్పాట్లు.. వారి నిరసనల ఉద్దేశ్యం, ఎజెండా.. శాంతి భద్రతల అంశం.. ఒకరితో ఒకరికి ఉన్న సంబంధం, నిధుల సమీకరణ, హాజరయ్యే గ్రూపులు, సంఘాలు, కీలక నేతలు, గతంలో వారికి ఉన్న నేర చరిత్ర వంటి అంశాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. వీటన్నింటి ఆధారంగా అక్కడ ఎలాంటి ఆందోళన జరగబోతుందో ముందుగానే పోలీసులు ఒక అంచనాకు రావొచ్చు.
ఆందోళనలు ఉద్రిక్తంగా మారకుండా అడ్డుకోవచ్చు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తారు. పోలీసులు ఒకరితో ఒకరు సమన్వయం చేసుకోవడానికి వైర్లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థను పటిష్టం చేయనున్నారు. దీని ఉద్దేశం నిరసనల్ని ఆపడం కాదని, శాంతియుతగా నిరసనలు జరిగేలా చేయడమే అని పోలీసులు తెలిపారు.