న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో కిడ్నీలు అమ్ముతున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. (Kidney Racket) ఒక మహిళా డాక్టర్‌తో సహా ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో ముగ్గురు బంగ్లాదేశ్ జాతీయులని పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని జసోలా విహార్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన కొంత మంది అనుమానాస్పద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రైడ్ చేయడంతో కిడ్నీ రాకెట్ విషయం వెలుగులోకి వచ్చింది. రస్సెల్, రోకాన్, సుమోన్ మియాన్, రతేష్ పాల్ అనే నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
కాగా, అరెస్ట్ చేసిన వారిని ప్రశ్నించగా మరిన్ని విషయాలు పోలీసులకు తెలిశాయి. బంగ్లాదేశ్‌కు చెందిన నిరుపేదల కిడ్నీల కోసం ఈ ముఠా రూ.4 నుంచి రూ.5 లక్షలు చెల్లిస్తున్నట్లు తెలుసుకున్నారు. కొన్నిసార్లు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎరగా వేసినట్లు చెప్పారు. వారి పత్రాలను ఫోర్జరీ చేసి కిడ్నీ విక్రయాలకు పాల్పడ్డారని, రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు కిడ్నీలను విక్రయించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.
మరోవైపు కిడ్నీ అమ్మకాల రాకెట్ నిర్వహిస్తున్న ఐదు రాష్ట్రాలైన ఢిల్లీ, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్లో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు దాడులు చేశారు. ముగ్గురు బంగ్లాదేశ్ జాతీయులతో సహా ఏడుగురిని అరెస్టు చేశారు. పలు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, సిమ్ కార్డులు, నగదు, ఫోర్జరీ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
కాగా, అరెస్టైన వారిలో నోయిడా ఆసుపత్రి కన్సల్టెంట్ సర్జన్ డాక్టర్ విజయ కుమారి కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె అక్రమంగా సుమారు 16 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు చెప్పారు. ఆ మహిళా డాక్టర్ ప్రతి కిడ్నీ మార్పిడి కోసం రూ.2 లక్షలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.