Delhi Blast | ఢిల్లీ కారుబాబు పేలుడు సంఘటనా స్థలం నుంచి పోలీసులు మూడు 9ఎంఎం క్యాలిబర్ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు.ఈ కాట్రిడ్జ్‌లలో రెండు లైవ్‌గా ఉండగా.. ఒకటి ఖాళీ షెల్ కనిపించింది. దాంతో పేలుళ్ల కేసు దర్యాప్తు కొత్త మలుపు తీసుకున్నది. వాస్తవానికి ఈ 9ఎంఎం కాట్రిడ్జ్‌లను నిషేధించారు. ప్రధానంగా భద్రతా దళాలు, ప్రత్యేక అధికారాలు ఉన్న వ్యక్తులు మాత్రమే వీటిని వినియోగించేందుకు అనుమతి ఉంది. మిగతా ఎవరూ ఉపయోగించకుండా నిషేధం అమలులో ఉన్నది. ఢిల్లీ పోలీసుల వర్గాల ప్రకారం.. పేలుడు కేసుల దర్యాప్తులో భాగంగా సంఘటన స్థలంలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ మూడు కాట్రిడ్జ్‌లను సెర్చ్ ఆపరేషన్ సమయంలో స్వాధీనం చేసుకున్నారు.
ఈ కాట్రిడ్జ్ల రూపాన్ని బట్టి చూస్తే, అవి సాధారణ వ్యక్తుల వద్ద ఉండకపోవచ్చని స్పష్టమవుతుంది. అయితే, వాటి ఉనికి వెలుగు చూడడంతో భద్రతా సంస్థలకు ఆందోళన కలిగిస్తున్నది. నిషేధిత కాట్రిడ్జ్‌లు పేలుడు జరిగిన ప్రదేశానికి ఎలా వచ్చాయనేదానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. క్యాట్రిడ్జ్‌లు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కుట్రలో భాగంగానే వచ్చాయా? లేకపోతే కేసును తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో సంఘటనా స్థలంలో పడేసి వెళ్లారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారాన్ని సేకరించేందుకు పోలీసులు క్యాట్రిడ్జ్‌లను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపారు.
ఇదిలా ఉండగా.. ఢిల్లీ ఎర్రకోటకు సమీపంలో ఉన్న మెట్రోస్టేషన్‌కు సమీపంలో కారులో ఒక్కసారిగా పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. పేలుడు సమయంలో కారులో భారీగా అమ్మోనియం అమ్మోనియం నైట్రేట్ ఉందని ఫోరెన్సిక్ అధికారులు తేల్చారు. సంఘటనా స్థలం నుంచి ఇప్పటి వరకు దాదాపు 40 శాంపిల్స్ సేకరించారు. ఇందులో బుల్లెట్లు, రెండు వేర్వేరు రకాల పేలుడు పదార్థాలు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ కేసులో నిందితుడితో సంబంధాలున్నాయన్న అనుమానంతో పలువురిని పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఉమర్ నబీ వాడిన కారులో ఒకడే ఉన్నాడా..? మరెవరైనా ఉన్నారా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి తెచ్చారు? ఎప్పుడు.. ఎక్కడ కారులోకి ఎక్కించారన్న కోణంలోనూ ఆరా తీస్తున్నారు.