DCGI | నకిలీ మందుల కట్టడికి డీజీసీఐ కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. అల్లెగ్రా, షెల్కాల్, కాల్పోల్, డోలో, మెఫ్టల్ స్పాస్తో సహా టాప్ 300 డ్రగ్ బ్రాండ్లపై బార్కోడ్లు, క్యూఆర్ కోడ్లను ముద్రించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం నుంచి డీసీజీఐ ఆదేశించింది. కొత్త విధానాన్ని కచ్చితంగా పాటించాలని, లేని పక్షంలో జరిమానా విధించనున్నట్లు హెచ్చరించింది. కొత్త విధానంపై సలహాలు, సూచనలు ఇవ్వాలని ఫార్మా కంపెనీలకు సూచించింది.
కంపెనీ పేరు, బ్రాండ్, చిరునామా, బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, గడువు తేదీ, తయారీదారు లైసెన్స్ నంబర్ తదితర సమాచారం అందుబాటులో ఉండాలని చెప్పింది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి తప్పనిసరిగా ఆయా కంపెనీలు క్యూఆర్ కోడ్, బార్కోడ్ ప్రింట్ చేయడం తప్పనిసరంటూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవలి మార్కెట్లో నకిలీ మందులు, నాణ్యత లేని మందులు పోటెత్తుతున్న విషయం తెలిసింది. దేశవ్యాప్తంగా పలుచోట్ల పెద్ద ఎత్తున డ్రగ్ కంట్రోల్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్న ఘటనలూ ఉన్నాయి.
అబాట్ కంపెనీ థైరాయిడ్ మందులు థైరోనోర్మ్ మందులను డ్రగ్ రెగ్యులేటరీ అధికారులు. నకిలీవిగా గుర్తించారు. మరో ఘటనలో గ్లెన్మార్క్ కంపెనీకి చెందిన బీపీ మాత్రలు టెల్మా-హెచ్ సైతం నకిలీవిగా తేల్చారు. ఇక దగ్గు సిరప్లు, ఇంజెక్షన్లు, టీకాల్లో సైతం నకిలీవి సరఫరా చేస్తున్నట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం మారుతూ వస్తున్న జీవనవిధానం, ఉరుకుల పరుగుల జీవితం, సమస్యలతో బాధపడుతున్నారు.
జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, ఒంటి నొప్పుల ఇలా ఏ చిన్న సమస్య ఉన్నా అంతా మెడికల్స్కు వెళ్లి మాత్రలు తీసుకొని వేసుకుంటున్నారు. ప్రస్తుతం ఎక్కువగా యాంటీ బయాటిక్స్, గుండె సంబంధిత మందులు, పెయిన్ కిల్లర్స్ తదితర మందులను ఎక్కువగా తీసుకుంటున్నారు. దేశీయ రిటైల్ మార్కెట్లో యాంటీ డయాబెటిక్స్ మిక్స్టార్డ్, గ్రైకోమెట్-జీపీ, యాంటీబయోటిక్స్ ఆగ్మెంటిన్, మోనోసెఫ్, గ్యాస్ట్రో తదితర మందులకు రూ.2 లక్షలకోట్ల వరకు మార్కెట్ ఉన్నది.