ఇండోర్, సెప్టెంబర్ 2: మధ్యప్రదేశ్ ప్రభుత్వం 17 ఏండ్లుగా విచారణకు అనుమతి ఇవ్వకపోవడంతో బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయపై ఉన్న ‘పింఛను స్కాం’ ఆరోపణల కేసును స్థానిక ప్రత్యేక కోర్టు మూసేసింది. ఈ మేరకు ప్రజాప్రతినిధులపై నమోదయ్యే కేసులపై విచారణ జరిపే ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముకేశ్ నాథ్ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. విచారణకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తే తిరిగి కోర్టుకు రావొచ్చని న్యాయస్థానం పిటిషన్‌దారుకు సూచించింది. అనుమతి మంజూరులో ప్రభుత్వ అలసత్వంపై ఫిర్యాదుదారు కేకే మిశ్రా రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ 17 ఏండ్ల వ్యవధిలో ఒక సంవత్సరం మినహా దాదాపుగా మిగతా 16 ఏండ్లు బీజేపీనే మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్నది.
రూ.33 కోట్ల కుంభకోణం
2000 నుంచి 2005 మధ్య విజయవర్గీయ ఇండోర్ మేయర్‌గా ఉన్నారు. ఆ సమయంలో పేదలు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్ల పంపిణీలో అవినీతి జరిగిందని కేకే మిశ్రా కోర్టులో కేసు వేశారు. నిబంధనల ప్రకారం బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా కాకుండా కోఆపరేటివ్ సంస్థల ద్వారా పింఛన్లు ఇచ్చారని.. ఈ క్రమంలో అనర్హులతో పాటు మరణించిన వారి పేర్లతో కూడా పింఛన్ డబ్బు విడుదల చేశారని, ఇందులో రూ.33 కోట్ల స్కాం జరిగిందని పేర్కొన్నారు. ఈ కేసులో విచారణకు 17 ఏండ్లుగా అనుమతి ఇవ్వకుండా మధ్యప్రదేశ్ ప్రభుత్వం అవినీతిపరులను రక్షిస్తున్నదని కేకే మిశ్రా ధ్వజమెత్తారు.